ప్రముఖ గాయని ఎస్.జానకి వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర౦
posted on Jan 28, 2013 10:45AM
ప్రభుత్వం తనకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించడం పట్ల ప్రముఖ గాయని ఎస్.జానకి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గాయని ఎస్.జానకి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అవార్డు గ్రహీతల ఎంపికలో ఏ రాష్ట్రంపట్ల కూడా వివక్ష చూపడం లేదని తెలిపింది. కేంద్ర మంత్రి వి.నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ, జానకి వ్యాఖ్యలను తోసిపుచ్చారు.
“ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడీ అవార్డు వచ్చి ఉపయోగం ఏముంది? దక్షిణాదికి ఎప్పుడూ అన్యాయమే జరుగుతోంది. నేను పెద్దసంతృప్తిగా అయితే ఏమీ లేను. పద్మభూషణ్ కంటే ఎక్కువే ఆశించాను. ఉత్తరాదికిచ్చిన ప్రాధాన్యం దక్షిణాదికి ఇవ్వట్లేదు. భారత రత్న ఇస్తే తీసుకుంటా. అంతకంటే తక్కువస్థాయిది ఏదిచ్చినా తీసుకోను అని ఎస్.జానకి చెప్పారు. ‘అవార్డు గ్రహీతల ఎంపిక ప్రక్రియలో ఏ రాష్ట్రంపైనా పక్షపాతం చూపడం లేదు. దక్షిణాది వారిని నిర్లక్ష్యం చేస్తున్నామనడం సబబుకాదు’ అని నారాయణ స్వామి పేర్కొన్నారు.
‘వివిధ అవార్డుల కోసం వచ్చే దరఖాస్తులను నిపుణుల కమిటీ పరిశీలించి, కొన్ని పేర్లను ఎంపికచేసి ఆ జాబితాను కేబినెట్ కార్యదర్శికి పంపుతుంది. అనంతరం గ్రహీతల పేర్లను ప్రధానమంత్రి, రాష్ట్రపతి నిర్ణయిస్తారు’ అని ఆయన చెప్పారు. అందువల్ల జానకి అవార్డును స్వీకరించాలని కోరారు.