రుషికొండ ప్యాలెస్‌లు కూల్చేయాలి.. కేంద్రానికి లేఖ!

విశాఖలోని రుషికొండ మీద వెలసిన వివాదాస్పద కట్టడాలు జగన్ ప్రభుత్వ తెలివితక్కువ తనానికి నిదర్శనంగా నిలిచి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ కట్టడాలను ఎలా ఉపయోగించుకోవాలో అర్థంకాక చంద్రబాబు ప్రభుత్వం బుర్ర వేడెక్కుతోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం జనం రకరకాల సూచనలు చేస్తున్నారు. అయితే రుషికొండ ప్యాలెస్‌లను కూల్చాలంటూ మాత్రం ఎవరూ అడగటం లేదు. అయితే, ఇప్పుడు ఆ డిమాండ్ కూడా బయటకి వచ్చింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి, విశాఖపట్నం వాస్తవ్యుడు అయిన ఈఏఎస్ శర్మ రుషికొండ కట్టడాలను కూల్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కట్టడాలన్నిటినీ కూల్చడమే కరెక్ట్ అని ఆయన అంటున్నారు. 
ఈ మేరకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. 

ఈఏఎస్ శర్మ  లేఖ ఇప్పుడు మాత్రమే రాయలేదు.. గతంలో అంటే, జగన్ ప్రభుత్వం వున్నప్పుడు కూడా ఆయన కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు రుషికొండ ప్యాలెస్ అసలు గుట్టు రట్టు కావడంతో ఈఏఎస్ శర్మ రాసిన లేఖకు కూడా ప్రాధాన్యం ఏర్పడింది. కేంద్ర అడవులు, పర్యావరణం, వాతావరణ మార్పుల శాఖ కార్యదర్శి లీనా నందన్‌కి శర్మ ఈ లేఖ రాశారు. రుషికొండలో వున్న కట్టడాలన్నీ వెంటనే కూల్చేయాలని, రుషికొండలూ సిఆర్‌జడ్ నిబంధనలు ఉల్లంఘించి కట్టడాలు కట్టరాదని కమిటీ ఇప్పటికే తేల్చిందని, కమిటీ నివేదికను కాదని చేపట్టిన ఈ నిర్మాణాలను వెంటనే కూల్చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. రుషికొండ ప్యాలెస్‌ల నిర్మాణానికి అయిన ఖర్చు మొత్తం ఆ నిర్మాణంతో సంబంధం వున్న అధికారుల నుంచి వసూలు చేయాలని సూచించారు. కేరళలో కూడా గతంలో ఇలాంటి నిర్మాణాలే చేసినప్పుడు సుప్రీం కోర్టు కూలగొట్టాలని ఆదేశించిందని, ఆ ఆదేశాల ప్రకారమే వాటిని కూలగొట్టారని ఈఏఎస్ శర్మ గుర్తుచేస్తున్నారు. 

రుషికొండ కట్టడాలు పర్యావరణానికి తీరని ద్రోహం చేసిన కట్టడాలని, పర్యాటక భవనాల పేరుతో పర్యావరణాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదని శర్మ చెబుతున్నారు. రుషికొండ భవనాలు 500 కోట్ల రూపాయల ఖర్చుతో కట్టారు కాబట్టి, కూలగొట్టకూడదు అనుకోవడం కరెక్ట్ కాదని, ఈ స్థాయిలో వున్న భవనాలు కూలగొడితే, భవిష్యత్తులో ఇలాంటి సాహసం ఇంకెవ్వరూ చేయరని ఆయన చెబుతున్నారు. పర్యవరణాన్ని పాడుచేసే కట్టడాలు కట్టడానికి పర్యాటకం అనే పేరు చెప్పడం ఫ్యాషన్ అయిందని ఆయన అంటున్నారు. కేంద్రానికి శర్మ రాసిన లేఖలో ఉదహరించిన చట్టాలు, నిబంధనలు చూస్తుంటే కళ్ళు తిరిగేలా వున్నాయి. ఇన్ని చట్టాలు, ఇన్ని నిబంధనలు వున్న ఎంతమాత్రం ఖాతరు చేయకుండా రుషికొండ కట్టడాలు కట్టారన్న విషయం అర్థమవుతోంది. మరి శర్మ రాసిన లేఖ మీద కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.