ఆర్టీసీ కార్మికులకు బలవంతపు రిటైర్మెంట్..! సంచలన నిర్ణయం దిశగా కేసీఆర్ కేబినెట్

ఆర్టీసీ సమస్యకు శాశ్వత ముగింపు పలికేందుకు కేసీఆర్ సర్కారు అడుగులు వేస్తోంది. ప్రగతిభవన్‌లో సమావేశమవుతోన్న తెలంగాణ మంత్రివర్గం... ఆర్టీసీ కార్మికుల భవితవ్యాన్ని తేల్చేయబోతోంది. ఆర్టీసీ ప్రైవేటీకరణకే మొగ్గుచూపుతోన్న ప్రభుత్వం.... కార్మికులకు కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ అమలుచేసి ఇంటికి పంపించనుందనే ప్రచారం జరుగుతోంది.

ఒకవేళ ఆర్టీసీ సమ్మె చట్టబద్ధంకాదని లేబర్ కమిషనర్ అండ్ లేబర్ కోర్టు తేల్చితే... కార్మికులకు తప్పనిసరి రిటైర్మెంట్ స్కీమ్‌ ఇప్లిమెంట్ చేయాలని భావిస్తోంది. 15ఏళ్ల సర్వీస్... 50ఏళ్లు దాటిన కార్మికులందరినీ ఇంటికి పంపేందుకు రంగంసిద్ధమైందంటున్నారు. ఒకవేళ అదే జరిగితే, 48వేల మంది కార్మికుల్లో మెజారిటీ సిబ్బంది ఉద్యోగాలను కోల్పోనున్నారు. అయితే, తప్పనిసరి రిటైర్మెంట్ స్కీమ్‌ అమలుచేస్తే, ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా, గత తీర్పులు, ఆయా ప్రభుత్వాలు అనుసరించిన విధానాలపై కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు చేసినట్లు తెలుస్తోంది.

కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ అమలుచేస్తే, ఆర్టీసీ కార్మికులకు పెన్షన్, గ్రాడ్యుటీతోపాటు ఫైనల్ సెటిల్‌మెంట్ చేయాల్సి ఉంటుంది. దాదాపు 48వేల మంది కార్మికులు ఉండటంతో... ఎంతమేర నిధులు అవసరమవుతాయి... వాటిని ఎలా సమీకరించుకోవాలన్నదానిపై కేబినెట్ చర్చించనుంది. అయితే, కంపల్సరీ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అనేది అత్యంత సున్నితమైన కీలక నిర్ణయం కావడంతో... కేబినెట్ సమావేశాన్ని రెండ్రోజులపాటు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆర్టీసీయే ప్రధాన అజెండాగా సమావేశమవుతోన్న మంత్రివర్గం.... చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకోబోతుందని అంటున్నారు.