పరిటాల పై రౌడీషీట్
posted on Jan 12, 2013 3:17PM
అనంతపురం జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే కామేపల్లి సుధాకర్ రెడ్డి హత్యకు కుట్రపన్నిన కేసులో పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరామ్ చుట్టూ పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. ఇప్పటికే పోలీసులకు దొరకకుండా ఈ కేసులో బెయిలు తెచ్చుకున్న శ్రీరామ్ మీద పోలీసులు రౌడీ షీట్ తెరిచేందుకు ప్రయత్నాలు చేయడం జిల్లాలో సంచలనం రేపుతోంది. కేవలం కక్ష్య సాధింపుతోనే ఈ రౌడీ షీట్ తెరుస్తున్నారని, శ్రీరామ్ ను అనవసరంగా ఈ ఉచ్చులోకి లాగుతున్నారని పరిటాల అభిమానులు అంటున్నారు.
ఈ కేసులో ఇప్పటికే కామేపల్లి సుధాకర్ రెడ్డి నాకు ఎలాంటి విభేదాలు పరిటాల కుటుంబంతో లేవని పలుమార్లు చెప్పారని, అయినా పోలీసులు ఇందులో చూయిస్తున్న అతృతను బట్టి రాజకీయ కోణంలోనే పోలీసుల చర్యలు ఉన్నాయని అంటున్నారు. యువకుడయిన శ్రీరామ్ భవిష్యత్ ను దెబ్బతీసేందుకు ఈ చర్యలు అని అంటున్నారు. మొత్తం ఈ కేసులో ఉన్న 11 మంది మీద రౌడీ షీట్ తెరుస్తున్నారు. మరో వైపు ఈ కేసులో నిందితులకు ఆశ్రయం ఇచ్చారని, పరోక్షంగా సాయం చేశారని పరిటాల సునీత, మరో టీడీపీ ఎమ్మెల్యే, టీడీపీ నేత మీద కేసులు పెట్టనున్నట్లు తెలుస్తోంది.