తెలంగాణాపై కొనసాగుతున్న చర్చలు
posted on Jan 13, 2013 12:11PM
కేంద్రం విదించుకొన్న నెల రోజుల గడువు ముగియడానికి ఇంకా కేవలం 15 రోజుల మాత్రమే ఉంది. ఈ నెల 28వ తేదీతో ఆ గడువు ముగియగానే, కేంద్ర నిర్ణయంతో రాష్ట్ర పరిస్థితి ఏవిదంగా మార బోతుందనే ఆందోళన రాజకీయ వర్గాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ, మినీ కోర్ కమిటీ, వార్ రూమ్ మీటింగ్, మేధో మధనం అంటూ ఈ సమస్యను పరిష్కరించడానికి చాలా కష్టపడుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈవిదంగా చేతులుకాలేక ఆకులు పట్టుకొనే పరిస్థితి తన చేజేతులా కొని తెచ్చుకోనదే అని చెప్పక తప్పదు. ఈ కష్టం ఏదో అదిముందే పడిఉంటే, రాష్ట్రంలో ఇంత అనిశ్చితి, ఇంత నష్టం ఉండేదికాదు. కాంగ్రెస్ కి ఈ జ్ఞానోదయం కలగడానికి రాష్ట్ర ప్రజలు చాల భారీ మూల్యమే చెల్లించేరు. ఏమయినప్పటికీ కాంగ్రెస్ ఇప్పటికయినా మేల్కొనడం సంతోషించవలసిన విషయమే.
తెరాస అధినేత కేసిర్ తో కాంగ్రెస్ అధిష్టానం తన దూతల ద్వారా చర్చిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరో వైపు, సీమంద్ర నాయకుల తాజా ప్రకటనలు చూస్తుంటే కాంగ్రెస్ తెలంగాణా రాష్ట్రం ఏర్పరచబోతోందని వారు నమ్ముతున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ గానీ, రాష్ట్ర విభజనకు పూనుకొంటే, మేము రాజీనామా చేస్తామని అప్పుడే కొందరు శాసన సభ్యులు ప్రకటనలు చేస్తుండటం గమనిస్తే, కాంగ్రెస్ ఏమి వారు చేయబోతోందో గ్రహించినట్లు తెలుస్తోంది.
కేంద్రం రాష్ట్ర విభజన విషయంలో ప్రస్తుతం పులి మీద సవారి చేస్తున్నట్లే భావించవచ్చును. అయితే, సమస్యని ఇప్పటికీ పరిష్కరించుకోలేకపోతే, అది మరింత అరాచకానికి దారి తీసి తీవ్ర సమస్యలకు దారి తీస్తుంది. కష్టమయినా, నష్టమయినా రాజకీయ పార్టీలు పట్టువిడుపులు ప్రదర్శించి విజ్ఞత చూపినప్పుడే రాష్ట్రంలో మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది. స్వార్ద రాజకీయ ప్రయోజనాలకోసం పార్టీలు ఇంకా తెలంగాణా లేదా సమైక్యంద్ర అంటూ ఉద్యమాలు కొనసాగిస్తే రాష్ట్రం మరెన్నటికీ కోలుకోలేని దారుణ పరిస్థితులకి చేరుకొంటుంది. రాజకీయాలకు సమాంతరంగా రకరకాల వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టి కోట్లు సంపాదించుకొంటున్న రాజకీయ నాయకులకి వీటి వల్ల ఏమీ తేడా లేకపోయినప్పటికీ, సామాన్య ప్రజలు మాత్రం వాటి దుష్పరినామాలని చిరకాలం ఎదుర్కోకతప్పదు.