పీపీఏలపై జగన్‌కు షాకిచ్చిన కేంద్రం...
posted on Sep 26, 2019 10:59AM

పీపీఏలపై జగన్ కు కేంద్రం మరోసారి షాకిచ్చింది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పై ప్రధానికి జగన్ చేసిన ఫిర్యాదుపై కేంద్ర మంత్రి ఆర్ కె సింగ్ కౌంటర్ వేశారు, జగన్ కు లేఖ రాశారు. డిస్కంల నష్టానికి అధిక టారిఫ్ కారణం కాదని లేఖలో ఆర్ కె సింగ్ స్పష్టం చేశారు. పీపీఏ లను అధిక ధరలకు చేసుకున్నారంటూ జగన్ పదేపదే చెబుతూ వస్తున్నారు, వీటి పై పునఃసమీక్షకు ప్రయత్నాలు చేస్తున్నారు. పీపీఎలను సమీక్ష చేయకపోతే డిస్కమ్ లు బతికి బట్టకట్టవంటూ జగన్ చెప్పుకొస్తున్నారు.
రాష్ట్రం లో కరెంటు ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని పారిశ్రామిక వేత్తలు వెనకడుగు వేస్తున్నారని జగన్ అంటున్నారు. డిస్కం ల నష్టాలకు ఇతర కారణాలున్నాయని లేఖలో ఆర్.కె.సింగ్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల్లో పీపీఏ లకు ఇంతకంటే అధిక ధరలు చెల్లిస్తున్నారని లేఖలో తెలిపారు. గాలి వేగం, సౌర ధార్మికత, ప్లాంట్ సామర్థ్యంపై పిపిఎల టారిఫ్ నిర్ణయం ఆధారపడి ఉంటుందని లేఖలో ఆర్.కె.సింగ్ వివరించారు. మూడు కంపెనీలకు డెబ్బై శాతం కేటాయింపులను టిడిపి ప్రభుత్వం చేసిందన్న వాదనను ఆర్ కె సింగ్ తోసిపుచ్చారు. పీపీఏలపై పునఃసమీక్ష చేస్తామనడం, వాటిపై ఆరోపణలు చేయడమంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని తన లేఖలో జగన్ ను సుతిమెత్తగా ఆర్ కె సింగ్ హెచ్చరించారు.