జగన్ కి కేంద్రం ఝలక్.. పునఃసమీక్ష అవసరంలేదు!!

 

హైకోర్టు, కేంద్రం ప్రభుత్వం పలుమార్లు పీపీఏలపై సమీక్ష వద్దని చెప్పినా వినకుండా ముందుకెళ్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్‌ పై కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కేసింగ్ అసంతృప్తి వ్యక్తం చేసారు. పీపీఏల ఒప్పందాల్లో ఎలాంటి అవినీతి జరగలేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు సీఎం జగన్‌కు విద్యుత్ మంత్రి ఆర్కేసింగ్ లేఖ రాశారు. డిస్కంల నష్టానికి అధిక టారిఫ్‌లే కారణమంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాదనలను ఆర్కేసింగ్ కొట్టిపారేశారు. డిస్కంలు నష్టాల్లో ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయని, అంతేగానీ దానికి టారిఫ్ లే కారణం కాదన్నారు. ఐదు రాష్ట్రాల్లో పీపీఏలకు ఇంతకంటే అధిక ధరలు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. పీపీఏల టారిఫ్‌ల నిర్ణయం గాలివేగం, సౌర, థార్మికత, ప్లాంట్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని ఆర్కేసింగ్ తెలిపారు. టీడీపీ ప్రభుత్వం మూడు కంపెనీలకే 70 శాతం కేటాయింపులు చేశారంటూ చేస్తున్న వాదనల్లోనూ నిజం లేదని ఆర్కేసింగ్ అన్నారు. కొన్ని కంపెనీలు మిగతా కంపెనీలను టేకోవర్ చేయడం వల్లే విద్యుత్ ఉత్పాదకత పెంచుకున్నాయని పేర్కొన్నారు. థర్మల్ పవర్ రూ.4.20 పైసలకే నేడు వస్తోందని మంత్రి తెలిపారు. కానీ 20 సంవత్సరాల తర్వాత యూనిట్ ధర రూ.22 అవుతుందని అన్నారు. పవన్ విద్యుత్ ఎప్పుడూ రూ.4.80కే లభిస్తుందన్నారు. పీపీఏలపై పునఃసమీక్షతో సాంప్రదాయేతర విద్యుత్ రంగాల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆర్కేసింగ్ తన లేఖలో పేర్కొన్నారు.