కేటీఆర్‌ బావమరిదిని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి

 

నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్‌ లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తోన్న 'సెన్సేషన్‌‌ రైజ్‌ డ్యాన్స్‌' కార్యక్రమ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో డ్రగ్స్ సరఫరా, మద్యం, అమ్మాయిలతో యథేచ్ఛగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భారీగా డబ్బులు వసూలు చేసి ఆ కార్యక్రమానికి మైనర్లను కూడా అనుమతిస్తున్నారని మండిపడ్డారు. ఈవెంట్స్ నౌ సంస్థ డేటింగ్ ఏర్పాటు చేస్తోందని.. అమ్మాయిలు, అబ్బాయిలను రూ. 3 వేలకే అప్పచెబుతామంటూ అరాచకాలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి కేటీఆర్‌ బావమరిది రాజ్ పాకాలకు చెందిన ఈవెంట్స్ నౌ సంస్థ ఈ దారుణమైన కార్యక్రమాన్ని చేపట్టిందని రేవంత్ అన్నారు. తెలంగాణ సర్కారు యువతను గంజాయి, డ్రగ్స్‌కు బానిసలుగా మారుస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమం నిర్వహణపై ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ జోక్యం చేసుకుని నిలువరించకుంటే తామే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని రేవంత్‌‌ హెచ్చరించారు. ఇంత జరుగుతున్నా టాస్క్ ఫోర్స్, సిట్‌ నిద్రపోతున్నాయా? అని ప్రశ్నించారు. బెంగళూరు, పుణేల్లో సెన్సేషన్ రైజ్ ఈవెంట్స్‌ను నిషేధిస్తే గచ్చిబౌలి స్టేడియంలో ఆ సంస్థ ఈవెంట్ నిర్వహణకు ఎలా అనుమతిచ్చారని రేవంత్‌రెడ్డి నిలదీశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu