గవర్నర్ వచ్చి తనను పలకరించనే లేదు
posted on Oct 27, 2018 2:45PM

వైజాగ్ ఎయిర్‌పోర్టులో వైసీపీ అధినేత జగన్‌పై జరిగిన దాడిని మంత్రి పరిటాల సునీత తోసిపుచ్చారు. జగనే కత్తితో పొడిపించుకున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై అనవసరంగా గొడవలు చేసి.. ప్రభుత్వం, చంద్రబాబు విఫలమయ్యారంటూ నేరం మోపుతున్నారని వ్యాఖ్యానించారు. వాళ్ల ఉచ్చులో వాళ్లే పడ్డారు. ప్రజల కళ్లు గప్పి డ్రామాలాడాలనుకుంటే ఎవరూ నమ్మే స్థితిలో లేరని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. పరిటాల రవిని పట్టపగలే హత్యచేశారు. తన భర్త ఎమ్మెల్యేగా చనిపోతే అప్పటి గవర్నర్ వచ్చి తనను పలకరించనే లేదని.. అప్పట్లో చంద్రబాబు ఒక్కరే మా కుటుంబాన్ని ఆదుకున్నారని గుర్తుచేశారు. జగన్ ఏపీ పోలీసులపై నమ్మకం లేదనడం బాధాకరమని అన్నారు. 3వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా ఎటువంటి ప్రమాదం జరగలేదన్నారు. అలాంటిది కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న ఎయిర్‌పోర్టులో దాడి జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. నిజాలు తెలుసుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆరోపణలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. ప్రమాదం జరిగిన వెంటనే వైజాగ్ లో కేసు పెట్టకుండా హైదరాబాద్‌కు ఎందుకు వెళ్లిపోయారని ప్రశ్నించారు. అయినా ఇలాంటి ఘటనలు జరగకూడదని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.