అప్పుడే చెప్పా.. అసలు ఆట ఇప్పుడు మొదలైంది..
posted on Oct 30, 2017 11:46AM
.jpg)
ఎన్నో ట్విస్ట్ లు, ఎన్నో విమర్శలు, ఎన్నో వార్తల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పడింది. రేవంత్ ఢిల్లీ పర్యటనతో మొదలైన ఈ వివాదం.. ఆయన రాజీనామాతో ఒక క్లారిటీకి వచ్చింది. టీడీపీకి రాజీనామా చేసి తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నానని చెప్పకనే చెప్పేశాడు. ఇక ఆయన ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతాడో ఒక్కటే తెలియాల్సిన విషయం. ఈ నేపథ్యంలోనే ఆయన తన నియోజక వర్గంలో పర్యటించగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీకి, తనకు మధ్య ఆట మొదలైందని వ్యాఖ్యానించారు. “ఆట మొదలైంది. ఆనాడు జైలు నుంచి వచ్చినప్పుడే చెప్పినా… ఆట మొదలైందని చెప్పి. నిజమైన ఆట ఇప్పుడు మొదలైంది. ఫైనల్స్ కు వచ్చేసింది. రేప్పొద్దున పీపుల్స్ ప్లాజాకు రండి. నక్లెస్ రోడ్డుమీద, హైదరాబాద్ నడిబొడ్డున, బుద్ధుడి ఎదురుగా నిర్ణయం తీసుకోనున్నా. ఆ నిర్ణయం ఈ రాష్ట్రంలో కేసీఆర్ పతనానికి నాంది పలకాలి.” అని తనదైన శైలి లో వ్యాఖ్యానించారు రేవంత్. ఇప్పటికే రేవంత్ కు మద్దతుగా పలువురు రాజీనామాలు చేయగా, మరికొందరు ఇవాళ, రేపు రాజీనామాలు చేస్తారని సమాచారం. అంతేకాదు కార్యకర్తలతో సమావేశం అనంతరం ఢిల్లీకి వెళ్లే రేవంత్, రేపు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో అధికారికంగా చేరనున్నట్టు తెలుస్తోంది. మరి కేసీఆర్ పై యుద్దానికి సిద్దమవుతున్న రేవంత్.. ఏమేరకు విజయం సాధిస్తాడో చూద్దాం..