నాడు నాదెండ్ల.. నేడు రేవంత్
posted on Oct 29, 2017 4:32PM

తెలుగుదేశం పార్టీ రాజకీయాల్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వారు కానీ.. పార్టీ కార్యకర్తలు కానీ నాదెండ్ల ఎపిసోడ్‌ను ఎప్పటికీ మరచిపోరు. విదేశాల్లో ఆపరేషన్ చేయించేందుకు వెళ్లిన నాటి పార్టీ అధినేత.. ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు ఇందిరాగాంధీ సహకారంతో నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆ తర్వాత ప్రజల మద్దతుతో ఎన్టీఆర్ తిరిగి సీఎం అయ్యారు. తాజాగా రేవంత్ రెడ్డి నాటి నాదెండ్ల భాస్కరరావును ఫాలో అయ్యారని ఆరోపించారు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన రేవంత్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాము కార్యకర్తలుగా ఉన్న రోజుల్లో అన్నగారికి నాదెండ్ల వెన్నుపోటు పొడిచారని.. ఇప్పుడు పార్టీకి రేవంత్ మరో నాదెండ్లలా తయారయ్యారని ఆరోపించారు. అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా.. ఢిల్లీకి వెళ్లి.. రాహుల్ గాంధీని కలిసి బాబుకు వెన్నుపోటు పొడిచారన్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న రేవంత్ రెడ్డికి చంద్రబాబు అన్ని విధాలుగా అండగా నిలబడ్డారని.. కానీ రేవంత్ మాత్రం తెలంగాణ తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు.