వాళ్లది పగలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌.. నైట్ ప్రగతి భవన్

 

ఏపీ టీడీపీ నేతలు యనమల రామకృష్ణుడు, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్‌కు తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయని.. వారి అండదండలతో వేల కోట్ల వ్యాపారాలను చేస్తున్నారంటూ.. కొద్దిరోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన టీటీడీపీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి సొంతపార్టీ నేతలపై మండిపడ్డారు. ఇవాళ గోల్కొండ హోటల్‌లో జరిగిన టీడీపీ-బీజేపీ శాసనసభాపక్ష సమావేశానికి రేవంత్ డుమ్మా కొట్టారు..

తాను ఆ సమావేశానికి ఎందుకు వెళ్లాలని.. కేసీఆర్ పెట్టే భోజనం కోసం తాను వెళ్లదలుచుకోలేదని అన్నారు. అక్కడితో ఆగకుండా ఉదయం నుంచి సాయంత్రం దాకా టీడీపీ కార్యాలయంలో ఉండి.. సాయంత్రం కాగానే కేసీఆర్ ఇంట్లో ఉండేవాళ్ళకు తాను సమాధానం చెప్పనని స్పష్టం చేశారు. ప్రజాసమస్యలను చర్చించడానికి స్టార్ హోటల్ ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి గులాబీ చీడ పట్టిందని.. దాన్ని వదిలించేందుకు రకరకాల మందులు కొడతానని అన్నారు. సొంతపార్టీ నేతలపై మొన్న చేసిన వ్యాఖ్యలే టీడీపీలో దుమారం రేపగా.. తాజాగా ఆయన సంధించిన విమర్శనాస్త్రాలు ఇంకేంత తుఫాను సృష్టిస్తాయో వేచి చూడాలి.. మొత్తానికి సాయంత్రం కేసీఆర్‌ను కలిసే టీడీపీ నేతలు ఎవరా అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.