తన ఆఫీసుకు తాళం వేసిన రేవంత్ రెడ్డి..!
posted on Oct 26, 2017 1:01PM
గత కొద్ది రోజులుగా వార్తల్లో నలుగుతున్న వ్యక్తి రేవంత్ రెడ్డి.. టీడీపీని వీడి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ వార్తలు రావడంతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగింది. దానికి తోడు కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉండటం.. సొంతపార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాలను విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో టీటీడీఎల్పీ నేత పదవి నుంచి రేవంత్‌ను తప్పిస్తున్నట్లు పార్టీ అధిష్టానం ప్రకటించింది. గతంలో టీడీపీ శాసనసభాపక్ష నేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు టీఆర్ఎస్‌లో చేరడంతో రేవంత్‌ను ఆ పదవిలో నియమించారు చంద్రబాబు. అయితే రేవంత్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటంతో ఆ పదవి నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో రేవంత్ అసెంబ్లీలో తనకు కేటాయించిన చాంబర్‌ను ఖాళీ చేశారు. ఈ ఉదయం అసెంబ్లీ కార్యాలయానికి వచ్చిన రేవంత్ అనుచరులు అక్కడి కంప్యూటర్లు, విలువైన ఫైళ్లను తరలించారు. అనంతరం గదికి తాళం వేసి తాళం చెవులను తమ వెంట తీసుకెళ్లారు. టీడీఎల్పీ నేత పదవి నుంచి రేవంత్‌ను తప్పించిన తర్వాతి రోజే ఈ ఘటన జరగడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.