జగన్ స్కెచ్.. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ డుమ్మా

నవంబర్ 8 నుంచి 13 వరకు జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇవాళ హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో పార్టీ అధినేత జగన్ అధ్యక్షతన శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలపైనే ప్రధానంగా చర్చించారు. చివరకు శాసనసభ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించారు. 20 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా చర్యలు తీసుకోలేదని.. పైగా పార్టీ మారినవారిలో నలుగురికి మంత్రిపదవులు కట్టబెట్టారని.. మంత్రులైన వారిని వైసీపీలో ఉన్నట్లు చూపిస్తున్నారని ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన 20 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే సమావేశాలకు హాజరయ్యే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.