రేవంత్ పై చంద్రబాబు యాక్షన్.. నేను వచ్చేంతవరకూ ఎమ్మెల్యేనే..!
posted on Oct 25, 2017 6:36PM
రేవంత్ రెడ్డి పార్టీ మార్పుపై వచ్చిన దుమారం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రేవంత్ కాంగ్రెస్ లో చేరుతున్నట్టు వచ్చిన వార్తలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద సంచలనమే సృష్టించాయి. అయితే ఆ తరువాత తాను పార్టీ మారేది లేదని.. అదంతా మీడియా చేస్తున్న రాద్దాంతం అని చాలా సింపుల్ గా యూటర్న్ తీసుకున్నాడు. దీనికి కారణం చంద్రబాబు ఫోన్ కాలే అని వార్తలు కూడా వచ్చాయి. ఇక రేవంత్ చేసిన ఈ హంగామాకుగాను టీడీపీ నేతలు ఆయనపై చాలా సీరియస్ గానే ఉన్నారు. ఈ క్రమంలోనే రేవంత్ క్రమశిక్షణా నియమాలను ఉల్లంఘించారని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబుకు లేఖ రాశారు. తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్ పదవుల నుంచి రేవంత్ రెడ్డిని తక్షణమే తొలగించాలని లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. అయితే రమణ లేఖపై స్పందించిన చంద్రబాబు ఆయనకు ఫోన్ చేసి.. తాను తిరిగి వచ్చేంత వరకూ టీఎస్ టీడీపీఎల్పీ, వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ కు ఉన్న అధికారాలన్నిటినీ తొలగిస్తున్నట్టు చెప్పారట. అంతేకాదు పార్టీకి సంబంధించిన సమావేశాలు రేవంత్ రెడ్డి నిర్వహించరాదని...పార్టీ తరఫున ఏవైనా సమావేశాలు నిర్వహించాలని భావిస్తే, రేవంత్ రెడ్డిని ఓ ఎమ్మెల్యేగా మాత్రమే భావిస్తూ ఆహ్వానించాలని సూచించారట. ఆయన అధ్యక్షతన ఎలాంటి సమావేశాలనూ అనుమతించేది లేదని, అవి పార్టీ సమావేశాలుగా గుర్తించవద్దని చంద్రబాబు ఆదేశించారట. తాను వచ్చిన తరువాత ఏం చేయాలో నిర్ణయిస్తానని చెప్పారట.
ఇదిలా ఉంటే మరోపక్క రేవంత్ రెడ్డి మాత్రం రమణ ఆదేశాలను పట్టించుకోకుండా మరీ టీడీపీ ఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపాడు. అంతేకాదు ఈ అసెంబ్లీలో టీడీపీ ఎల్పీ సమావేశానికి రావాలని ప్రజా ప్రతినిధులను కూడా ఆహ్వానించారు. అంతేకాదు తనను సస్పెండ్ చేయాలని కోరుతూ ఎల్ రమణ స్వయంగా చంద్రబాబుకు లేఖ రాయడంపై రేవంత్ స్పందించారు. టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్ ను తానేనని, తన సమావేశాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. మరి ఆఖరికి రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమవుతుందో తెలియాలంటే చంద్రబాబు వచ్చేంత వరకూ ఆగాల్సిందే.