రేవంత్ మంత్రివర్గ విస్తరణ.. ఓ అంతులేని కథ !
posted on Apr 5, 2025 9:37AM
.webp)
ఏప్రిల్ 3 తేదీ వచ్చింది. వెళ్ళింది. కానీ ఆ రోజున జరుగుతుందని అనుకున్న తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ జరగలేదు. ఎందుకన్నది ఎవరికీ తెలియదు. కానీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అసలు మూడున ముహుర్తమని మీకు ఎవరు చెప్పారు అంటూ మీడియానే ఎదురు ప్రశ్నించారు. ఉగాదికి మంత్రివర్గ విస్తరణ చేస్తామని తాము ఎక్కడా చెప్పలేదని అన్నారు. అంతే కాదు.. మంత్రివర్గ విస్తరణ ఏఐసీసీ పరిధిలో ఉన్న అంశం సో ..అప్పడే కాదు, ఇప్పడు కూడా ఎప్పుడు ఉంటుందో చెప్పలేమన్న సత్యాన్ని చక్కగా తేల్చి చెప్పారు. సో ... ఢిల్లీ ఎప్పుడు దయతలిస్తే అప్పుడే మంత్రవర్గ విస్తరణ ఉంటుంది. అంతవరకు ఎవరు ఎన్ని ముహూర్తాలు పెట్టినా అవి మురిగి పోతాయనే రీతిలో పీసీసీ చీఫ్ చక్కటి క్లారిటీ ఇచ్చారు.
అయితే అదే సమయంలో మహేష్ కుమార్ గౌడ్ బీసీలకు మరో రెండు మంత్రిపదవులు ఇవ్వాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కోరామని అందుకు ఆ ఇద్దరు, ఓకే చెప్పారని చెప్పుకొచ్చారు. అంటే ఇప్పడు మంత్రివర్గం విస్తరణ కథ మళ్ళీ మొదటికి వచ్చినట్లేనని పార్టీ నేతలు పీసీసీ చీఫ్ చెప్పిన మాటలకు భాష్యం చెపుతున్నారు. అవును మళ్ళీ చర్చలు, సంప్రదింపులు, సమీకరణలు, లెక్కలు, కుడికలు, తీసివేతలు ఇలా చాలా తతంగం ఉంటుందనీ, సో.. మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదనే విషయం స్పష్టమైందని అంటున్నారు.
నిజానికి మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదని, ’తెలుగు వన్’ ఎప్పుడో చెప్పింది. ఇప్పడు అదే జరిగింది.ఇప్పటికే ఒకటి మూడు ముహూర్తాలు మురిగి పోయాయి. ముందు మార్చి 29న అన్నారు. ఆ వెంటనే లేదు లేదు ఉగాది పండగ రోజు ( మార్చి 30) సాయంత్రం పక్కా అన్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 3 ముహూర్తం ఫిక్స్ అన్నారు. ఉగాది పండగ రోజున ముఖ్యమంత్రి, గవర్నర్ ను కలిశారు. అది కూడా అందుకే అంటూ ప్రచారం జరిగింది. అయితే అదీ.. ఇదీ.. ఏదీ ముడి పడలేదు. ఇక ఇప్పడు, బంతి పూర్తిగా ఢిల్లీ పెద్దల కోర్టులో ఉందనే విషయంలో టోటల్ క్లారిటీ వచ్చింది. అఫ్కోర్స్ ఇప్పుడనే కాదు.. ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ ఢిల్లీ పెద్దల ఇష్టం ప్రకామే జరుగుతుంది. నిజానికి బీజేపీలో కూడా అంతే. అందుకే జాతీయ పార్టీలలో అదొక ఆచారంగా మారిన అపచారం అని పెద్దలు అంటారు. అయితే,ఇప్పడు తెలంగాణ విషయంలో జరుగుతున్నది అదేనా అంటే.. అదే అయినా ఇంకా ఏదో ఉందనే అనుమానాలు కూడా గాంధీ భవన్ లో వినిపిస్తున్నాయని అంటున్నారు.
అదలా ఉంటే ఇప్పడు కాంగ్రెస్ వర్గాల్లో మరో చర్చ మొదలైంది. మార్చి 24న ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ లనుఉన్నపళంగా ఢిల్లీకి రమ్మని ఎందుకు పిలిచినట్లు? నిజంగా మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకే అయితే అంత హడావిడి చేసి, ఇప్పడు ఇలా కూల్ కూల్’గా సైలెంట్’ అయిపోవడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి అనే ప్రశ్నలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అధిష్టానం ఇంకెందుకో పిలిస్తే.. ఆ రహస్యం బయటకు చెప్పలేక చెప్పిన ‘విస్తరణకు పచ్చ జెండా’ కథ బయటకు వచ్చిందా? అందుకే ఇప్పడు ఒక్క అబద్ధాన్ని కప్పిపుచ్చుకునేందుకు వంద అబద్దాలు ఆడవలసి వస్తోందా ? అందుకే మంత్రి వర్గ విస్తరణ కథ ఇలా మలుపుల మీద మలుపులు తిరుగుతూ, డిమ్కీలు కొడుతూ ఒక ప్రహసనంగా మారిందా? అన్న అనుమానాలు కూడా వ్యక్త మవుతున్నాయి.
అయితే ఎవరిలో ఎన్ని అనుమానాలు ఉన్నా? ఆసలు తెర వెనక ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియక పోయినా, ఆశావహులు ఢిల్లీ వెళుతూనే ఉన్నారు. ఇప్పుడు కాకపోతే.. మరో పది రోజులకో, పక్షం రోజులకో ఎప్పుడో అప్పుడు మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నఆశతో ఢిల్లీ వెళుతూనే ఉన్నారు. పెద్దలను కలుస్తూనే ఉన్నారు. ‘ఒక్క ఛాన్స్’ కోసం బరువైన దరఖాస్తులు సమర్పించుకుంటూనే ఉన్నారు. ఆ వార్తలు వస్తూనే ఉన్నాయి.
అదొకటి అలా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొందర పాటు నిర్ణయాలతో ప్రభుత్వ ప్రతిష్ట, పార్టీ ప్రతిష్ట రోజు రోజుకు దిగజారి పోతోందని ఢిల్లీ పెద్దలకు విన్నవించుకుంటున్న పార్టీ సీనియర్ నాయకులు మరో మారు, ‘మార్పు’ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి, ఇదేమీ ఇప్పడు కొత్తగా మొదలైన ప్రయత్నం కాదు. అయితే హెచ్‌సీయూ భూబాగోతం వంటి తాజా పరిణామాల నేపధ్యంలో ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ పేర్లు కూడా బద్నాం అవుతున్న నేపధ్యంలో సీనియర్ నాయకులూ అటుగా ఫోకస్ పెట్టి ప్రయత్నాల స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది. అదెలా ఉన్నా మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి నంతవరకు ఢిల్లీ గుప్పిట్లో దాగున్న నిజం ఏమిటో తెలిసే వరకు ఇదొక అంతులేని కథలా సాగుతూనే ఉంటుందని, అనుభవజ్ఞులైన పెద్దలు అంటున్నారు.