ఎస్‌బీఐకి తాళాలు!
posted on Apr 5, 2025 9:15AM
.webp)
ఖాతాదారులు ఏకంగా బ్యాంకుకే తాళాలు వేసిన సంఘటన ఇది. ఈ సంఘటన వరంగల్ జిల్లా రాయపర్తిలో జరిగింది. కొందరు ఖాతాదారులు రాయపర్తిలోని ఎస్బీఐకు తాళం వేసి బ్యాంకు కార్యకలాపాలను అడ్డుకున్నారు. ఈ బ్యాంకులో గత ఏడాది నవంబర్ 19న చోరీ జరిగింది. ఆ చోరీలో బ్యాంకులో 497 మంది ఖాతాదారులకు చెందిన 16 కేజీలకు పైగా బంగారాన్ని దుండగులు చోరీ చేశారు. అప్పటి నుంచీ తమ బంగారం తిరిగి ఇవ్వాలంటూ బాధితులు ఎంతగా మొరపెట్టుకున్నా బ్యాంకు అధికారులు పట్టించుకోకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారు.
ఈ విషయంపై గతంలో పలుమార్లు బ్యాంకు కస్టమర్లు, బాధితులు బ్యాంకు ఎదుట ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలోనే బ్యాంకు అధికారులు ఇటీవల శనివారం (ఏప్రిల్ 4) చెల్లింపులు చేపడతామని హామీ ఇచ్చారు. దీంతో శనివారం (ఏప్రిల్ 4) ఉదయం బాధితులు బ్యాంకు వద్దకు వెళ్లారు. అయితే బ్యాంకు అధికారులు మరో వాయిదా వేస్తూ, సోమవారం రావాల్సిందిగా చెప్పారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు బ్యాంకుకు తాళం వేసి ఆందోళనకు దిగారు. పోలీసులు, అధికారులు ఎంతగా చెప్పినా వినకుండా బ్యాంకు ఎదుటే ధర్నాకు దిగారు. తమ బంగారం తిరిగి ఇచ్చేంత వరకూ కదిలేది లేదంటూ బైఠాయించారు.
