స్మగ్లర్ అప్పు దొరికిపోయాడు
posted on Dec 3, 2014 8:47AM
మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్, హత్యకేసులో నిందితుడు అయిన అన్బు సెల్వం అలియాస్ అప్పును చిత్తూరు పోలీసులు మంగళవారం నాడు అరెస్టు చేశారు. అప్పు ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో కీలక నిందితుడు. అలాగే కంచి శంకరమఠం మేనేజర్ రామన్ హత్యకేసులో అప్పు ప్రధాన నిందితుడు. అప్పును అరెస్టు చేసిన చిత్తూరు పోలీసులు తమదైన శైలిలో ఇంటరాగేషన్ చేయడంతో అప్పు అనేక కీలక విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. ఎర్రచందనం అక్రమ రవాణాలో తనకు సహకరించిన అనేకమంది పేర్లను అప్పు బయటపెట్టినట్టు సమాచారం. ఘనమైన నేరచరిత్ర వున్న అప్పు కోసం పోలీసులు చాలాకాలంగా వెతుకుతున్నారు. ఇన్నాళ్ళకి దొరికిన అప్పును పోలీసులు బుధవారం శ్రీకాళహస్తి కోర్టులో హాజరుపరచనున్నారు. స్మగ్లింగ్ డబ్బుతో అప్పు విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. చెన్నైలో ఒక పెద్ద హోటల్ కట్టించేంత డబ్బు అప్పు సంపాదించాడు. పేరులో ‘అప్పు’ ఉన్నప్పటికీ అప్పు చేయాల్సిన అవసరం లేని గొప్ప జీవితాన్ని స్మగ్లర్ అప్పు ఇప్పటి వరకూ ఆస్వాదించాడు. దాదాపు 140 కోట్ల ఆస్తులు వున్న అప్పు ఇప్పుడు లాకప్పులో వున్నాడు.