గవర్నర్ - సర్కార్ సయోధ్య ఎండమావేనా ?

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్.. రాష్ట్ర ప్రభుత్వం మధ్య సయోధ్య కుదిరింది. రెండున్నరేళ్లుగా ఎడ ముఖం, పెడ ముఖంగా ఉన్న గవర్నర్  తమిళి సై, ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర  హై కోర్టు ప్రమేయంతోనే అయినా  శాసన సభ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో రాజ్యాంగ విధులను రాజ్యాంగబద్దంగా నిర్వర్తించారు.

గత సంవత్సరం తరహాలోనే ఈ సంవత్సరం కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు కానిచ్చేయాలని సర్కార్ భావించినా, బడ్జెట్ ఆమోదం కోసం కోర్టు మెట్లు ఎక్కినా ప్రయోజనం లేక పోయింది. కోర్టు సూచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఒకడుగు వెనక్కివేసి గవర్నర్  తో సయోధ్యకు సుముఖత వ్యక్త పరిచారు. ఆ విధంగా శాసన  సభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ సంప్రదాయాన్ని పాటిస్తూ, ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని అక్షరం పొల్లుపోకుండా చదివి వినిపించారు.  గవర్నర్ తమ రాజ్యాంగ కర్తవ్యాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసేఆర్ కూడా అనివార్యంగానే అయినా తమ రాజ్యాంగ విధులను నిర్వర్తించారు. గవర్నర్ కు ఇవ్వవలసిన గౌరవం ఇచ్చారు.  దీంతో, అనుమానాలున్నా రాజ్ భవన్ ప్రగతి భవన్ మధ్య  సయోధ్య కుదిరిందనే అభిప్రాయం ఏర్పడింది. 

ఇది జరిగి వారం రోజులు అయింది. ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలను గమనిస్తే సయోధ్య మీద సందేహాలు మరింత బలపడుతున్నాయి. గవర్నర్ పసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై సభలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి పాల్గొనలేదు. ముఖం చాటేశారు. గవర్నర్ పేరు ప్రస్తావించడం గవర్నర్ కు కృతఙ్ఞతలు చెప్పడం ఇష్టం లేకనే ముఖ్యమంత్రి ముఖం చాటేశారని అంటున్నారు. మరో వంక ముఖ్యమంత్రి బదులుగా ఆయన కుమారుడు  రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఆయన అదే విధంగా చర్చలో పాల్గొన్న అధికార  బీఆర్ఎస్ సభ్యులు గవర్నర్ ప్రసంగంలో లేని అంశాలను ప్రస్తావిస్తూ  కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

మంత్రి కేసీఆర్ అయితే తమ సహజ ధోరణిలో కేంద్ర ప్రభుత్వాన్నే కాదు  ప్రధాని మోడీని, బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వ విధానాలను, అనర్గళంగా  ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ భాషలలో తిట్టి పోశారు.  సో.. సర్కార్ సైడు  నుంచి చూస్తే,  గవర్నర్ తో సయోధ్యకు ప్రభుత్వం సిద్ధంగా లేదనే విషయం స్పష్టమైంది. 

మరోవంక గవర్నర్ తమిళి సై  గత శాసన సభ సమావేశాల్లో ఆమోదించిన ఆరు బిల్లులకు ఇంతవరకు ఆమోదం తెలపలేదు. నిజానికి, కోర్టు వెలుపల కుదిరిన ఒప్పందం ప్రకారం పెండింగ్ బిల్లులకు ఆమోదం తెలిపేందుకు గవర్నర్ అంగీకరించారనే ప్రచారం జరిగింది. కానీ  ఇంతవరకు రాజ్ భవన్ నుంచి సానుకూల సంకేతాలు రాలేదు. మరో వంక ఈ వారం రోజుల్లోనే గవర్నర్  రెండో సారి ఢిల్లీ వెళుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చెన్నైలో ఉన్న గవర్నర్ అక్కడినుండి నేరుగా ఢిల్లీ వెళ్ళనున్నారని  తెలుస్తోంది.

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్  కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.  ఈ పర్యటనలో గవర్నర్ తమిళి సై తెలంగాణలో తాజా పరిస్థితులను కేంద్రానికి వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో వంక ఢిల్లీ లిక్కర్ స్కాం, ఫార్మ్ హౌస్ ఎమ్మెల్యేల బేర సారాల కేసు వేగంగా కదులుతున్నాయి. ఈ నేపధ్యంలో గవర్నర్ ఢిల్లీ టూర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవంక సయోధ్య ఎండమావనే విషయం మరోమారు స్పష్టమైందని అంటున్నారు.