భార్యాభర్తల గొడవలకు కారణాలు ఏంటి? వాటిని ఎలా అధిగమించాలంటే..!

 

తల్లిదండ్రుల తో బంధం చిన్నతనం నుంచి ఉంటుంది.  అందుకే వారితో ఏదైనా గొడవ జరిగితే అది కొన్ని గంటలు లేదా రోజులలో క్లియర్ అవుతుందిి. కానీ భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు చాలా వరకు తీవ్ర పరిస్థితులకు దారి తీస్తుంటాయి.  అసలు భార్యభర్తల మధ్య గొడవలకు కారణాలు ఏంటో తెలుసుకుంటే బంధాన్ని నిలబెట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. భార్యభర్తల మధ్య గొడవలు అనేవి సాధారణంగా వివాహిత జీవితంలో వస్తుంటాయి. ఇవి చిన్నపాటి అభిప్రాయ భేదాల నుంచి తీవ్రమైన సమస్యల వరకు ఉండవచ్చు. గొడవలకు ప్రధానమైన  కారణాలు ఇవే:

 ఆర్థిక సమస్యలు


డబ్బు ఖర్చులు, ఆదాయం, పొదుపు పై అగ్రిమెంట్ లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవకు దారి తీస్తుంది.  భర్త తనదే ఆధిపత్యం అని, భార్య తనకు ప్రాధాన్యత ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకుంటాడని ఇలా.. ఇద్దరూ ఆర్థిక విషయాలలో అబిప్రాయ బేధాలతో గొడవలు పడే అవకాశాలు ఉంటాయి. అలాగే ఒకరి ఖర్చు పద్ధతులు ఇంకొకరికి నచ్చకపోవడం కూడా ఆర్థిక గొడవలకు కారణం అవుతుంది.

ఆత్మీయత లోపం లేదా శారీరక సంబంధాల్లో తేడా..

శారీరక సంబంధాలపై అబద్ధపు అంచనాలు,  ప్రేమ లేదా స్పర్శలో లోపం భార్యాభర్తల మద్య పెద్ద గొడవలకు కారణాలు అవుతాయి. సాధారణంగా వివాహం అనేది ప్రేమ, నమ్మకం,  శారీరకంగా ఒకరిని ఒకరు కోరుకోవడంలోనే ఆధారపడి ఉంటుంది. కానీ వివాహం తరువాత ఇవి లోపిస్తే ఇద్దరి మధ్య అసంతృప్తి ఏర్పడి అది కాస్తా గొడవలుగా మారుతుంది.

అభిప్రాయ భేదాలు..

కుటుంబపరమైన నిర్ణయాలు, పిల్లల పెంపకం, జీవిత పద్ధతులపై విభిన్న అభిప్రాయాలు ఉంటాయి.  భార్యాభర్తలు ఇద్దరూ కలసి చర్చించి ఈ విషయాలలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ భర్త తను, తన తల్లిందండ్రులు చెప్పినట్టే జరగాలని, భార్య తన మాట నెగ్గాలని పంతానికి పోతే ఇద్దరి మధ్య అబిప్రాయ బేధాలు ఏర్పడి గొడవలు అవుతాయి.

ఆత్మగౌరవ సమస్యలు / ఈగో సమస్యలు..

ఒకరి మాటకి మరొకరు విలువ ఇవ్వకపోవడం. చిన్న విషయాల్లోనూ తానెక్కడా తగ్గకూడదన్న భావన భార్యాభర్తల మధ్య గొడవలు సృష్టిస్తుంది.  భార్యాభర్తలు తామరిద్దరూ సమానమే అనే విషయాన్ని తెలుసుకుని ఒకరిని ఒకరు గౌరవించుకుంటే.. ఒకరి మాటకు మరొకరు ప్రాధాన్యత ఇవ్వగలరు.

అభిమానాలు / అనుమానాలు..

ఒకరిపై మరొకరికి నమ్మకం లేకపోవడం, చిర్రెత్తించే ప్రవర్తనలపై అనుమానాలు పెరగడం వల్ల బంధం విచ్చిన్నమవుతుంది. బంధంలో నమ్మకమే కీలక పాత్ర పోషిస్తుంది.

అనుసంధానం లోపం (Communication Gap)..

సరిగ్గా మాట్లాడుకోకపోవడం, భావాలను పంచుకోకపోవడం వల్ల గొడవలు వస్తాయి. పెళ్లంటే కేవలం ఆర్థికంగా,  ఇంటి పనులలో ఒకరి అవసరం మరొకరికి ఉండటం కాదు.  ఇద్దరి మధ్య మానసిక అనుబంధం కూడా ఉండాలి.  స్నేహితుల్లా మాట్లాడుకోవాలి.

బంధువుల జోక్యం..

భార్యాభర్తల తల్లిదండ్రుల  జోక్యం,  తోబుట్టువులు,  స్నేహితులు, బంధువుల జోక్యం వల్ల, వారిచ్చే సలహాల కారణంగా  ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకోవడం జరిగి గొడవలు వస్తాయి.

వ్యక్తిత్వ తేడాలు..

ఒకరు చురుకుగా ఉండగా, ఇంకొకరు అంతగా కాకపోవడం,  జీవితంలో గమ్యం లేదా అభిరుచుల్లో తేడా ఉండటం. వీటి వల్ల  ఇద్దరి మధ్య జీవితానికి సంబంధించిన లక్ష్యాలు,  భవిష్యత్ ప్రణాళికలు వంటివి చేరుకోలేక పోతారు.

సమస్యలు తగ్గించడానికి మార్గాలు:
ఓపికగా వినాలి, సానుభూతితో స్పందించడం చాలా ముఖ్యం.

స్పష్టమైన సంభాషణ  ఉండాలి. దీని వల్ల ఇద్దరి మధ్య అపార్థాలు రావు.

పరస్పర గౌరవం ఉండాలి.  గౌరవం లేని బంధం ఎక్కువ కాలం నిలబడదు.

చిన్న విషయాల్లో క్షమించటం నేర్చుకోవాలి.  అన్ని విషయాలకు పంతానికి పోతూ ఉంటే తనను గౌరవించట్లేదని భాగస్వామి అర్థం చేసుకునే అవకాశం ఉంది.

అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకోవడం మంచిది. ఇది భార్యాభర్తలు చేస్తున్న తప్పులు తెలియజేసి ఒకరితో ఒకరు ఎలా ఉండాలో తెలుసుకునేలా చేస్తుంది.

                                                         *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News