మోకాళ్ళ నొప్పులు వేధిస్తున్నాయా... ఇవే అసలు కారణాలు!
posted on Mar 27, 2023 9:30AM
కాళ్ల నొప్పులు గృహిణులలో ఒక సాధారణ సమస్య. చాలామంది మహిళలు తరచుగా వారి మోకాళ్ళలో నొప్పి అంటూ ఉంటారు. మోకాళ్ల నొప్పుల కారణంగా మహిళల వర్కింగ్ స్టైల్ కూడా దెబ్బతింటుంది. కీళ్ల లేదా మోకాళ్ల నొప్పులకు ప్రధాన కారణాలలో ఒకటి పేలవమైన జీవనశైలి మరియు ఆహారంలో పోషకాహార లోపం. నేటి ఆధునిక జీవనశైలి వల్ల కీళ్ల నొప్పులు వస్తున్నాయి. ఈ సమస్య రాత్రిపూట ఎక్కువగా వేధిస్తుంది. ఒక వయస్సు తర్వాత, స్త్రీలు, పురుషులు ఇద్దరూ మోకాలి నొప్పి గురించి ఫిర్యాదు చేస్తారు, అయితే ఈ సమస్య పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మోకాళ్ల నొప్పుల సమస్యను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో నొప్పులు పెరిగే అవకాశం కూడా ఉంది. మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతుంటే, ముందుగా ఈ సమస్యకు కారణాలు ఏమిటో తెలుసుకోవాలి. మోకాలి నొప్పి నుండి ఉపశమనం పొందడానికి నివారణలు తెలుసుకోవాలి.
మోకాలి నొప్పి కారణాలు
పురుషుల కంటే మహిళలకు మోకాళ్ల నొప్పులు ఎక్కువ. పురుషులు, స్త్రీల శరీర నిర్మాణంలో వ్యత్యాసం దీనికి ఒక కారణం. నిజానికి స్త్రీల కీళ్ల కదలికలు ఎక్కువగా ఉండడం వల్ల వారి లిగమెంట్లు కూడా మరింత ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. స్త్రీల మోకాళ్ల కదలిక ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీని వల్ల నొప్పులు వచ్చే అవకాశాలు ఎక్కువ.
మెనోపాజ్ తర్వాత, మహిళల్లో ఋతు చక్రంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ల స్థాయి తగ్గుతుంది. ఈస్ట్రోజెన్ అనేది మహిళల్లో కనిపించే హార్మోన్, ఇది మోకాళ్లను ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడుతుంది. కానీ పీరియడ్స్‌లో ఈస్ట్రోజెన్ హార్మోన్ తక్కువ స్థాయి మోకాళ్లపై ప్రభావం చూపుతుంది.
మోకాలి గాయాల విషయంలో, సరిగ్గా లేక వెంటనే చికిత్స చేయకపోతే, భవిష్యత్తులో నొప్పి ప్రమాదం పెరుగుతుంది.
వ్యాయామం చేసినప్పుడు లేదాఎక్కువగా పరిగెత్తినప్పుడు, మోకాలి చిప్ప, స్నాయువులపై ఒత్తిడి ఉంటుంది. కీళ్ల నొప్పులు పెరుగుతాయి. అధిక వ్యాయామం ఆరోగ్యానికి హానికరం.
పురుషులతో పోలిస్తే మహిళల్లో కీళ్ల నొప్పులకు అధిక బరువు లేదా ఊబకాయం ఒక కారణం. ఊబకాయం సమస్యకు పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ మంది బాధితులు. అధిక బరువు వల్ల మోకాళ్లపై ఒత్తిడి పడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అధిక బరువు, మోకాళ్లపై ఐదు రెట్లు ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది.
తేలికపాటి నొప్పి ఉన్నప్పుడు తరచుగా ప్రజలు దానిని లైట్ తీసుకుంటారు., ఇది మోకాళ్లలో ఎక్కువ నొప్పికి అవకాశాలను పెంచుతుంది. ఆస్టియో ఆర్థరైటిస్ రీసెర్చ్ సొసైటీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం, ఒక వ్యక్తికి ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు మోకాలి నొప్పి ఉంటే, అది ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల వచ్చినధై ఉండొచ్చు.
కీళ్ల నొప్పులకు నివారణలు
మోకాళ్లు లేదా కీళ్లలో నొప్పి రాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. దీని కోసం, వ్యాయామం చేస్తే, దాన్ని కూడా అవగాహనతో ఎంపిక చేసుకోవాలి. అప్పుడు మోకాళ్ల మృదులాస్థిని కాపాడుకోవచ్చు.
మోకాళ్ల నొప్పులను నివారించడానికి స్విమ్మింగ్ సైక్లింగ్ చేయవచ్చు. ఈ వ్యాయామం భవిష్యత్తులో మోకాళ్లకు నష్టం జరగకుండా చేస్తుంది.
అధిక బరువు కారణంగా, మోకాళ్లపై ఒత్తిడి ఉంటుంది, కాబట్టి బరువు విషయంలో జాగ్రత్త.
అతిగా వ్యాయామం చేయడం వల్ల కీళ్లలో నొప్పి కూడా వస్తుంది. కొన్నిసార్లు వేగంగా లేవడం, కూర్చోవడం లేదా నడవడం వంటి అధిక శ్రమ నొప్పిని కలిగిస్తుంది. జుంబా, ఫంక్షనల్ వర్కవుట్, సూర్య నమస్కారం, పద్మాసనం వంటివి ఎక్కువగా సాధన చేయడం వల్ల నొప్పి పెరుగుతుంది. కాబట్టి నిపుణుల సలహా మేరకు మాత్రమే వ్యాయామం చేయాలి.
మోకాళ్లలో వాపు వచ్చినా, నొప్పి వచ్చినా పట్టించుకోకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. మోకాళ్ల సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్తులో సమస్య పెరుగుతుంది.
◆నిశ్శబ్ద.