జగన్ గారు ‘గుడ్‌ బుక్’ పెడతారంట!

తెలుగుదేశం నాయకుడు నారా లోకేష్ ‘రెడ్ బుక్’ పెట్టారు కదా. వైసీపీ పాలనలో అన్యాయాలు, అక్రమాలకు, దోపిడీలు, దారుణాలు, వేధింపులకు పాల్పడిన వాళ్ళ పేర్లు ఆ రెడ్ బుక్‌లో రాశారు కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెడ్ బుక్‌లో పేర్లున్న వాళ్ళ సంగతి తేలుస్తానని చాన్నాళ్ళ క్రితమే చెప్పారు కదా. అయితే అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా, ఇంతవరకు ఆ రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు కదా. నారా లోకేష్ ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేయకముందే వైసీపీ నాయకుడు జగన్ ‘రెడ్ బుక్ ఓపెన్ చేశారు మొర్రో’ అని మొత్తుకుంటున్నారు కదా. రెడ్ బుక్ ఓపెన్ చేయకముందే వైసీపీ వర్గాలు ఇలా మొత్తుకుంటున్నాయి... ఇక రెడ్ బుక్ ఓపెన్ చేస్తే పరిస్థితి ఎలా వుంటుందో అని జనం అనుకుంటున్నారు కదా.. ఇదిలా వుంటే, వైసీపీ అధ్యక్షుడు జగన్ నిన్నటిదాకా బెంగళూరు ప్యాలెస్‌లో రెస్టు తీసుకుని, మళ్ళీ ఇంకోసారి ఆంధ్రప్రదేశ్‌కి చుట్టపుచూపుగా వచ్చారు. అయ్యగారు వచ్చినప్పుడల్లా ఏదో ఒక మీటింగ్ పెట్టడం, కూటమి ప్రభుత్వాన్ని తిట్టిపోయడం, 2029లో మళ్ళీ మన ప్రభుత్వం వస్తుందని చెప్పడం, ఆ తర్వాత ఫ్లయిటెక్కి తుర్రుమని బెంగళూరు వెళ్ళిపోవడం మామూలే కదా. జగన్ గారు మళ్ళీ ఆ టైమ్ టేబుల్‌ ఏమాత్రం తప్పకుండా పాటిస్తున్నారు. ఈసారి ఆయన మంగళగిరిలో పార్టీ నాయకులతో సమావేశం పెట్టారు. ఎప్పట్లాగే కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబుని విమర్శించడం అయిన తర్వాత, ఆయన ప్రసంగంలో ఒక ప్రాస విసిరారు. లోకేష్ రెడ్ బుక్ పెట్టారని అంటున్నారని, మనం కూడా ‘గుడ్ బుక్’ పెడదామని జగన్ అన్నారు. ఆ గుడ్ బుక్‌లో పార్టీలో మంచి పనులు చేసిన వాళ్ళ పేర్లు రాస్తారట. అలా మంచి పనులు చేసిన వాళ్ళకి ఆ తర్వాత కిరీటాలు పెడతారట. జగన్ ఈ మాట చెప్పినప్పుడు ఆ మీటింగ్‌లో వున్న వాళ్ళ ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. కాకపోతే, వైసీపీ వాళ్ళు ‘గుడ్ బుక్’ పెట్టినా, ఆ గుడ్ బుక్ తెరిచే అవసరం ఎప్పటికీ రాదు.. ఒక వేళ ఎవరైనా తెరిచినా ఆ గుడ్‌బుక్‌లో ఎప్పటికీ తెల్లటి కాగితాలే కనిపిస్తాయి. ఎందుకంటే, అధికారంలో వున్న ఐదేళ్ళలో ఒక మంచి పనీ చేయడానికి చేతులు రాని వైసీపీ నాయకులు, ఇప్పుడు అధికారంలో లేకపోతే ఇంకేం చేస్తారు... అని తెలుగుదేశం నాయకులు అంటున్నారు.