జగనన్న పేపర్ బ్యాలెట్ వేదాంతం!

అధికారంలో వున్న సమయంలో ఎవరో అడిగితే, జాతీయ రాజకీయాల గురించి మనకెందుకన్నా అని ఎంతమాత్రం సిగ్గుపడకుండా చెప్పిన జగనన్న ఇప్పుడు జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. పనిలో పనిగా తన మనసులో వున్న బాధని కూడా వెళ్ళగక్కుతున్నారు. మంగళవారం నాడు వెలువడిన హర్యానా ఎన్నికల ఫలితాల మీద జగనన్న తన అమూల్యమైన అభిప్రాయాన్ని తన ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఆయన ట్వీట్ సారాంశం ఇదిగో... ‘‘మరోసారి ఎన్నికల ఫలితాలు ప్రజాభిప్రాయాన్ని గందరగోళానికి గురిచేస్తున్నాయి.  హర్యానా ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలకు ఎంతమాత్రం భిన్నంగా లేవు. మనలాంటి ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్యం బలంగా ఉండటమే కాకుండా అభివృద్ధి చెందేలా కూడా వుండాలి. ఈ రెండిటినీ సాధించడానికి ఏకైక మార్గం పేపర్ బ్యాలెట్‌కి తిరిగి వెళ్లడం. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, నార్వే, డెన్మార్క్‌లతో సహా చాలా అభివృద్ధి చెందిన దేశాలు పేపర్ బ్యాలెట్‌ను ఉపయోగిస్తున్నాయి. మనం కూడా ప్రపంచంలోని ఇతర దేశాల తరహాలోనే పేపర్ బ్యాలెట్ వైపు వెళ్లే సమయం ఆసన్నమైంది. పేపర్ బ్యాలెట్ ఓటర్ల విశ్వాసాన్ని పెంచుతుంది. ప్రజల్లో విశ్వాసాన్ని నింపేందుకు అందరూ ముందుకు రావాలి’’ అని జగన్ తన ట్వీట్‌లో వక్కాణించారు.