రామోజీరావు ఒక వ్యవస్థ... చంద్రబాబు!

మీడియా దిగ్గజం, వ్యాపార ప్రముఖుడు, సినీ ప్రముఖుడు దివంగత చెరుకూరి రామోజీరావు సంస్మరణ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలోని కానూరులో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రామోజీరావు వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ అని చంద్రబాబు నాయుడు ఈ సందర్బంగా అన్నారు. ఏ రంగంలో అయినా రామోజీరావు నంబర్‌వన్‌గా రాణించారని చెప్పారు. ఒక ఎన్టీఆర్‌ని, ఒక రామోజీరావుని ఎవరూ అధిగమించలేరని చంద్రబాబు అన్నారు. 


‘‘అమరావతిలో రామోజీరావు విజ్ఞానకేంద్రం ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ అభివృద్ధిలో రామోజీరావు పాత్ర ఎంతో వుంది. నవ్యాంధ్రకు ఏ పేరు పెట్టాలా అని ఆలోచిస్తున్న సమయంలో రామోజీరావు ‘అమరావతి’ పేరును సూచించారు. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన వ్యక్తి రామోజీరావు. పనిచేస్తూనే చనిపోవాలని కోరుకున్న వ్యక్తి రామోజీరావు తాను కోరుకున్నట్టుగానే కన్నుమూశారు. తెలుగు జాతి అన్నా, తెలుగు భాష అన్నా రామోజీరావుకు ఎంతో ఆప్యాయత. తెలుగుజాతికి ఆయన చేసిన సేవలకు తగిన గుర్తింపు రావాలి. ఎన్టీఆర్, రామోజీరావు ఇద్దరూ యుగపురుషులు, వీరికి భారతరత్న సాధించడం మన బాధ్యత. రాష్ట్రంలో ఒక రోడ్డుకు రామోజీరావు పేరు పెడతాం. విశాఖలో రామోజీ చిత్రనగరి ఏర్పాటు చేస్తాం. రామోజీరావు ప్రజల ఆస్తి. ఆయన స్థాపించిన వ్యవస్థలను భావితరాలకు అందించాలి’’ అని చంద్రబాబు అన్నారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ‘‘రామోజీరావు మాట్లాడే విధానం నన్ను ఎంతో ఆకర్షించింది. ఆయన ఏం మాట్లాడినా ప్రజా సంక్షేమం కోణంలోనే మాట్లాడేవారు. పత్రికా స్వేచ్చ సమాజానికి ఎంత అవసరమో ఆయన చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి రామోజీరావు రాజీలేని పోరాటం చేశారు. అమరావతిలో రామోజీరావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి’’ అన్నారు. 

రామోజీరావు కుమారుడు కిరణ్ మాట్లాడుతూ, ‘‘నాన్నగారు క‌ల‌లు క‌న్న న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి రామోజీ గ్రూపు త‌ర‌ఫున‌... నాన్న‌గారి జ్ఞాప‌కార్ధం 10 కోట్ల రూపాయ‌ల విరాళం ఇస్తున్నాం’’ అని ప్రకటించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని రామోజీరావు ఔన్నత్యాన్ని కొనియాడారు.