రంజాన్ మాసం-చివరి శుక్రవారం!!

మహమ్మదీయ మిత్రులు ఎంతో ముఖ్యమైనదిగా భావించే రంజాన్ మాసంలో చివరి శుక్రవారాన్ని జుమాతుల్ విదా అని అంటారు. సాధారణంగా శుక్రవారాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావించే ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో చివరి శుక్రవారాన్ని  అని శుక్రవారాల కంటే ప్రత్యేకంగా చూస్తారు. అరబ్బీ భాషలో జుమా అంటే శుక్రవారం. అల్ విదా అంటే వీడ్కోలు. జుమాతుల్ విదా అంటే చివరి శుక్రవారానికి వీడ్కోలు పలకడం అని అర్థం. అంటే రంజాన్ మాసం ముగింపు దశకు వచ్చిందని, ముస్లిం మిత్రులు ఎంతో భక్తిగా ఆచరిస్తున్న ఉపవాసాలకు కూడ వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చేస్తోందని అర్థం.

రంజాన్ మాసం మొదలును ఈద్-అల్-ఫితర్ గా చెప్పుకుంటామని అందరికీ తెలిసినదే.  నెలవంక దర్శనంతో ఇది ప్రారంభమవుతుంది, ఇది ఇస్లామిక్ ప్రపంచానికి చాలా పవిత్రమైన రోజు.  వ్యక్తులు పవిత్ర ఖురాన్‌ను పఠించాలని, ఒకరికొకరు తమ సంతోషాన్ని అందరితో పంచుకోవాలని నియంగా ఉంటుంది. కావాలంటే ప్రతిచోటా ఇద్దరు ముస్లిం సోదరులు ఎదురుపడితే ఆలింగనంతో ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం చూడవచ్చు.  ఈ మాసంలో  పేదలకు దానాలు చేయడం ద్వారా ఇవ్వడంలో ఉన్న గొప్పదనాన్ని తెలుపుతారు  

 జుమాతుల్ విదా చరిత్ర

 వారంలో ప్రతి శుక్రవారం ఇస్లామిక్ సంప్రదాయాలు మరియు సంస్కృతి ప్రకారం ముఖ్యమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈరోజు ప్రార్థనలు చేయడం వల్ల ముస్లిం సోదరులు  తమకు ముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఇంకా రంజాన్ మాసంలోనే ఖురాన్ ఆవిర్భవించింది కాబట్టి ఖురాన్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెడతారు.  ఈ సందర్భంగా  ఖురాన్‌ను తప్పనిసరిగా పఠిస్తారు, దేవుని ఆశీర్వాదాలను పొందడం కోసం నిరాశ్రయులకు మరియు నిస్సహాయంగా ఉన్నవారికి ఆహారం అందించడం, సహాయాలు చేయడం వంటి ఇతర ధార్మిక చర్యలను పాటిస్తారు.

  ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం, దేవుని దూత ఈ నిర్దిష్ట రోజున (శుక్రవారం ప్రార్థన) మసీదును సందర్శించి, ఇమామ్‌ను వింటాడు.  ఆ సమయంలో అక్కడ ఉండటం వల్ల దేవుడి కృపకు పాత్రులు అవ్వగలమనే నమ్మకంతో ఉదయాన్నే ప్రార్థనల కోసం మసీదుకు వెళ్లే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం  ఏమిటంటే రంజాన్ మాసంలో వచ్చే ఈ చివరి శుక్రవారం రోజున నమాజ్ చేయడం వల్ల, తాము ఏదైనా తప్పులు చేసి ఉంటే అల్లాహ్ వారిని క్షమిస్తాడని  ప్రవక్త మహమ్మద్ తన బోధనలలో తెలిపారు. 

చివరి శుక్రవారం రోజున అన్ని ప్రాంతాలలో  మసీదు వెలుపల షామియానాలు ఏర్పాటు చేస్తారు. ప్రార్థనలు కోసం వచ్చే భక్తుల రద్దీ కారణంగా, అందరూ ప్రార్థనలు చేసుకోవడానికి అనువుగా ఇలాంటి ఏర్పాట్లు చేస్తారు. ఎక్కువ భగణ ఖురాన్ పఠించడానికి కేటాయిస్తారు.  స్వచ్ఛంద సంస్థలకు విరాళం ఇవ్వడం లేదా పేదలకు ఆహారం ఇవ్వడం భవిష్యత్తులో పుణ్యాన్ని పొందుతుందని నమ్ముతారు అదే విషయాన్ని తమ పిల్లలకు కూడా చెబుతారు.

సమాజ్ సందడి!!

ముస్లిం సోదరులు తమ జీవితంలో నమాజ్ ను కూడా భాగంగా చేసుకుని ఉంటారు. అయితే రంజాన్ మాసంలో మాత్రం నమాజ్ పెద్ద ఎత్తున చేస్తున్నారు. సాధారణంగా కొందరు రోజులో రెండు లేదా మూడు సార్లు నమాజ్ చేసుకుంటారు కానీ రంజాన్ మాసంలో మాత్రం అయిదు సార్లకు తగ్గకుండా నమాజ్ చేయడం తప్పనిసరి. నమాజ్ కు ముందు వజూ చేయడం పరిపాటి. వజూ అంటే ముఖం, కాళ్ళు, చేతులు మూడుసార్లు నీటితో శుద్దిచేసుకోవడం.  ఇందుకోసం మసీదు లలో ప్రత్యేకంగా చిన్న చిన్న నీటి సరస్సులు, ఏర్పాటు చేయబడి ఉంటాయి కూడా.

సుర్మా….. సొగసు!!

నిజానికి సుర్మా అనేది ముస్లిం సోదరులు జీవితంలో ఒక అలంకరణ అంశంగా మాత్రమే కాకుండా అదొక భక్తి భావనగా కూడా చూస్తారు. నమాజ్ చేసుకోవడానికి ముందు వజూ చేసి, కళ్ళకు  సుర్మా పెట్టుకోవడం తప్పనిసరిగా రంజాన్ మాసంలో చేస్తారు. కళ్ళకు కాటుక లాగా పౌడర్ రూపంలో ఉండే నల్లని సుర్మా ఎంతో అందంగా ఉంటుంది. ఇంకా దీని వెనుక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముస్లిం సోదరులు అవధూతగా భావించే మహమ్మద్ ప్రవక్త సుర్మాను ఎప్పుడూ పెట్టుకునేవారని, అందుకే రంజాన్ మాసంలో దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెబుతారు. ఇంటికి వచ్చిన అతిథులకు అందమైన భరణి లలో సుర్మాను, అత్తరును బహుమతిగా ఇవ్వడం ముస్లిం సోదరులు ఆచారం కూడా.

చివరి శుక్రవారం మీతోటి ముస్లిం సోదరులకు సహకరించండి మరి. పండుగ, సంబరం, సందేశం అందరివీ మరి.

                            ◆వెంకటేష్ పువ్వాడ.