పాక్ పర్యటనపై రాజ్ నాథ్ సింగ్.. వారికి మంచి బుద్ధి ప్రసాదించి..
posted on Aug 5, 2016 2:59PM

కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సార్క్ సదస్సులో పాల్గొనడానికి పాకిస్థాన్ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆయన పాకిస్థాన్ పర్యటనకు తీవ్ర వ్యతిరేకత వచ్చిన సంగతి కూడా విదితమే. అంతేకాదు ఆయన అక్కడికి వెళ్లినప్పుడు కూడా ఉగ్రవాద అనుకూల సంస్థలు, కశ్మీర్ వేర్పాటువాద నేతలు రాజ్‌నాథ్ పాకిస్థాన్‌లో పర్యటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేశారు. ఇప్పుడు ఈ విషయాన్నే ఆయన రాజ్యసభలో ప్రస్తావించారు.
సార్క్ సదస్సు వివరాల గురించి.. తనకు ఎదురైన వ్యతిరేకత గురించి వివరించారు. రాజ్‌నాథ్ మాట్లాడుతూ ‘చట్టాల నుంచి ఉగ్రవాదులు తప్పించుకోకుండా చూడాలని సార్క్ సదస్సులో కోరానని తెలిపారు. అంతేకాదు తీవ్రవాదులపై ప్రపంచ దేశాలన్నీ సమ్మతించిన ఆంక్షలను అన్ని దేశాలు అమలు పరచాలని.. ఉగ్రవాదులకు తోడ్పడే దేశాలపై చర్యలు తీసుకోవాలని చెప్పానని చెప్పారు. అయితే అసలు నిరసనలకు పాల్పడతారని తెలిస్తే పాక్‌కి వెళ్లేవాడిని కాదు. నేను హెలికాఫ్టర్‌లో హోటల్ కి వెళ్లినప్పుడు కొందరు వ్యక్తులు నాకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. దేవుడా, అందరికీ మంచి బుద్ధిని ప్రసాదించు’ అని ఆయన వ్యాఖ్యానించారు.