ఒక పక్క విషాదం.. మరోపక్క మంత్రిగారి సెల్ఫీ..
posted on Aug 5, 2016 1:30PM

కొంతమంది నేతలు తెలిసి చేస్తారో.. తెలియక చేస్తోరో..లేక తాము అధికారంలో ఉన్నాం కదా ఏం చేసినా చెల్లుతుందిలే అని అనుకుంటారో తెలియదుకానీ.. తప్పులు చేస్తుంటారు. చిక్కుల్లో పడతారో. ఇప్పుడు మహారాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి ప్రకాశ్ మెహతా కూడా అలాంటి చిక్కుల్లోనే పడ్డారు. వివరాల ప్రకారం.. ముంబయి-గోవా రహదారిపై మహద్ వద్ద బ్రిటిష్ కాలం నాటి పురాతన వంతెన సావిత్రి నది ఉద్ధృతికి కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 50 మంది గల్లంతవ్వగా , సహాయక సిబ్బంది ఇప్పటి వరకూ 14 మృతదేహాలను వెలికి తీశారు. దీంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సందర్శించడానికి వచ్చారు. ఆయనతోపాటు ప్రకాశ్ మెహతా కూడా వచ్చారు. వచ్చిన ఆయన ఖాళీగా ఉండటం ఎందుకని అనుకున్నారేమో.. ఓ సెల్ఫీ తీసేసుకున్నారు. అంతే ఇక ఆయనపై ఒకటే విమర్శలు. ఒకపక్క అక్కడ అంత విషాదం నెలకొంటే.. మంత్రిగారు సెల్పీ తీసుకోవడం ఏంటని మండిపడుతున్నారు. ఇక ఈ విషయాన్ని ప్రశ్నించిన మీడియా వారిపై కూడా ఆయన దురుసుగా ప్రవర్తించి బుక్కయ్యారు. దీంతో మీడియా ప్రతినిధులు మంత్రికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు.
మరి ఇంతా తెలిసి ప్రతిపక్ష పార్టీలు ఊరుకునే ఉంటాయా.. ఆయన చేసిన పనికి తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆఖరికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.