అకాల వర్షంతో తడిసిన ధాన్యం
posted on May 18, 2011 9:46AM
మహబూబ్‌నగర్: మంగళవారం నాటి అకాల వర్షాలకు అన్నదాత కుదేలయ్యాడు. గోనె సంచుల కొరత వల్ల కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం రాశులు పోసి వుంచారు. వర్షానికి ధాన్యమంతా తడిసిముద్దయింది. మహబూబ్‌నగర్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం నీటిపాలైంది. నష్టం కోట్లల్లో వుంటుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మొత్తమ్మీద మార్కెట్ యార్డులకు తెచ్చిన 80 వేల బస్తాల ధాన్యం తడిసిపోయింది. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో వర్షానికి సుమారు 500 హెక్టార్లలో వరి నేలకొరిగింది. పట్టణంలోని కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టిన దాదాపు వెయ్యి క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది. సిరిసిల్లలో ఏడు వేల క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్దయింది. సుమారు 1500 క్వింటాళ్ల ధాన్యాన్ని రైతులు నాలుగు రోజుల నుండి కామారెడ్డి మార్కెట్ యార్డు ఆవరణలో ఆరబెడుతున్నారు. కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, గంబీరావుపేటలోనూ ఈదురు గాలుతో కూడిన వర్షం పడింది. సిరిసిల్ల కొనుగోలు కేంద్రంలోని సుమారు ఏడు వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది. సుమారు 150మంది రైతులకు చెందిన వరిధాన్యం నీట మునిగింది. మెదక్ జిల్లాలో అకాల వర్షానికి నంగునూరులోని పాలమాకుల కొనుగోలు కేంద్రంలో 15 లారీల ధాన్యం తడిసిపోయింది. ధాన్యం కొనుగోలును అధికారులు నిలిపేయడంతో వారం రోజులుగా రైతులు మార్కెట్‌యార్డులోనే పడిగాపులు కాస్తున్నారు. ఈ వర్షానికి అది కాస్తా తడిసిపోయింది