ఆజాద్‌తో కెసిఆర్ మంతనాలు
posted on May 18, 2011 9:52AM
హైదరాబాద్: రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌కు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఫోన్ చేశారు. 2004 నుంచి గులాం నబీ ఆజాద్‌తో కెసిఆర్‌కు సత్సంబంధాలున్నాయి. 2004లో ఇరు పార్టీల మధ్య ఎన్నికల పొత్తు ఆజాదే కుదిర్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కెసిఆర్ ఆజాద్‌ను కోరినట్లు సమాచారం. అందుకు కాంగ్రెసు అధిష్టానం తీసుకుంటున్న చర్యలేమిటని కెసిఆర్ అడిగినట్లు తెలుస్తోంది. అయితే ఆజాద్ దానికి సమాధానం ఇవ్వకుండా కెసిఆర్ ఆరోగ్యం, తెరాస పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నట్లు చెబుతున్నారు. మర్యాదపూర్వకంగానే కెసిఆర్ ఆజాద్‌కు ఫోన్ చేశారని తెరాస వర్గాలు చెప్పాయి. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెసు అధిష్టానం ఇచ్చిన హామీని కెసిఆర్ గుర్తు చేశారు. ఐదు నిమిషాల పాటు వారిద్దరి మధ్య సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే తాము పెద్ద యెత్తున ఆందోళనకు సిద్ధపడుతున్నామని కెసిఆర్ చెప్పినట్లు సమాచారం. జూన్ లోగా కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కెసిఆర్ కోరారు.