జలదిగ్బంధంలో బిగ్-బి బంగ్లా... ముంబైలో రెయిన్ రెడ్ అలర్ట్

కుండపోత వర్షాలతో ముంబై మహానగరం అతలాకుతలమవుతోంది. కొద్దిరోజులుగా కురుస్తోన్న అతి భారీ వర్షాలతో దేశ ఆర్ధిక రాజధాని జలదిగ్బంధంలో చిక్కుకుంది. రోడ్లన్నీ కాలువలుగాను, కాలనీలు సరస్సులుగాను మారిపోయాయి. రహదారులపై మోకాళ్ల లోతు వరకు నీరు చేరడంతో వాహన రాకపోకలు స్తంభించిపోయాయి. ఇక సామాన్య ప్రజానీకం ఎటూవెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఎక్కడికక్కడ వరద నీరు చుట్టుముట్టడంతో కనీసం ఇంటి నుంచి కాలు బయటికి పెట్టలేకపోతున్నారు. మరోవైపు, కుండపోత వర్షాలు, వరద బీభత్సంతో ప్రజారవాణా స్తంభించింది. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది, బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అలాగే విమాన రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతోంది. లోకల్ రైల్వే స్టేషన్లలోకి భారీగా వరద నీరు చేరడంతో ట్రైన్లను రద్దుచేశారు. అలాగే, పలుచోట్ల వాహనాలు వరద నీటిలో ఇరుక్కుపోయాయి.

ముంబైలో ప్రధాన ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాలనీలకు కాలనీలే నీట మునిగాయి. పెద్దపెద్ద అపార్ట్‌మెంట్లలోకి సైతం వరద నీరు పోటెత్తింది. ముఖ్యంగా పాల్గార్‌, రాయగడ్‌, రత్నగిరి, సియాన్‌, పరేల్‌, దాదర్‌, బైకుల్లా, కింగ్ సర్కిల్‌, రైల్వే స్టేషల్‌, గాంధీ మార్కెట్ ప్రాంతాలు కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బిగ్‌ బి అమితాబ్ బచ్చన్ బంగ్లాలోకి కూడా వరద నీరు ప్రవేశించింది. అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో టేక్ కేర్ ముంబై అంటూ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మరో మూడు నాలుగు రోజులపాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ముంబై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే, పోలీసులకు కాల్ చేయాలంటూ ఎమర్జెన్సీ టోల్ ప్రీ నెంబర్స్‌ను ఏర్పాటు చేశారు.

ముంబై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తతుండటంతో భారత వాతావరణశాఖ మొదట ఆరెంజ్ అలర్ట్... ఆ తర్వాత రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రికార్డుస్థాయిలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అకాశముందని, అందువల్ల ఇళ్ల నుంచి బయటికి రావొద్దంటూ సూచించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu