ఆన్ లైన్‌తో అవస్థలే... జగన్ సర్కార్ ఇసుక పాలసీ ఎలా ఉందంటే?

ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే చాలు... ఇకపై నేరుగా ఇంటికే ఇసుక రానుంది. అదీ కూడా ఇంతకుముందు కంటే చీఫ్‌ అండ్ బెస్ట్‌ ప్రైస్‌కే. కొత్త మైనింగ్ విధానానికి ఆమోదం తెలిపిన ఏపీ మంత్రివర్గం.... కారుచౌకగా ఇసుకను అందుబాటులోకి తెచ్చింది. టన్ను ఇసుక ధర కేవలం 375 రూపాయిలుగా నిర్ణయించింది. అలాగే, ఇసుక రవాణాకి కిలోమీటర్ కి 4 రూపాయల 90 పైసలుగా నిర్ణయించారు. అంతేకాదు, మాఫియా, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ఇంటికే ఇసుక సరఫరా జరిగేలా రోడ్ మ్యాప్ ప్రకటించింది. ఇసుక కావాల్సినవాళ్లు... ఇంట్లో కూర్చొని... ఏపీఎండీసీ ద్వారా... ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే చాలు... ఇంటికే ఇసుక సరఫరా చేయనున్నారు. అంతేకాదు జీపీఎస్ అమర్చిన వాహనాల్లో ఇసుకను సప్లై చేయనుండటంతో... ట్రాకింగ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పించబోతున్నారు. అయితే, ఎవరూ ఇసుకను స్టాక్ పెట్టుకునేందుకు వీల్లేదని, అలాగే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కేవలం స్థానిక అవసరాల నిమిత్తం మాత్రమే వాడుకోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది.

అయితే, ప్రస్తుతం 41 స్టాక్ యార్డుల్లో మాత్రమే ఇసుక అందుబాటులో ఉందన్న ప్రభుత్వం... అక్టోబర్ నాటికి 70కి పెంచుతామని ప్రకటించింది. కానీ, ప్రస్తుతమున్న డిమాండ్ మేరకు అందుబాటులో ఉన్న ఇసుక రీచ్ లు, స్టాక్ యార్డులు సరిపోవనే మాట వినిపిస్తోంది. పైగా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవడం సామాన్య ప్రజానీకానికి సాధ్యమయ్యే పని కాదు. అలాగే, బుక్ చేసుకున్న తర్వాత వెంటనే పంపిస్తారా? లేక ఎన్ని రోజులు పడుతుందనేది ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. అయితే, కొత్త పాలసీ క్షేత్రస్థాయిలో అమల్లోకి వచ్చాకే, కొత్త విధానంలో లోపాలు, కష్టాలు తెలిసే అవకాశముంటుంది. ఏదేమైనా అవినీతికి ఆస్కారం లేకుండా ఇసుక సరఫరా చేస్తామంటోన్న ప్రభుత్వం... ఎదురయ్యే సమస్యలను ఎలా అధిగమిస్తుందో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu