చినుకు పడితే.. విశ్వనగరం విశ్వనరకం
posted on Sep 19, 2025 10:41AM

హైదరాబాద్ నగరంలో గత రెండు రోజులు కురిసిన భారీ వర్షానికి విశ్వనగరం చిగురుటాకులా వణికింది. నగరం మొత్తం అతలాకుతలం అయ్యింది. పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని మైసమ్మగూడ చెరువులో తండ్రీ కుమార్తెల మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసుల ప్రాధమిక దర్యాప్తు లో మృతులను బహదూర్ పల్లి ఇందిరమ్మ కాలనీ కి చెందిన అశోక్ (50) అతని కుమార్తె దివ్య (5) గా గుర్తించారు. భార్య సోనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కాగా హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్మశాన వాటిక గోడ కూలిపోయి మూడు కార్లు ధ్వంసం అయ్యాయి. ఇక వర్షం పడితే డేంజర్ జోన్ గా మారిపోయే అసిఫ్ నగర్ లో పెద్ద ఎత్తున వరద నీరు పొంగిపొర్లతో పరిస ప్రాంతాల్లో ఉన్న ఇళ్లల్లోకి చేరుకున్నాయి. గత రెండు రోజులుగా దోమల్ గూడ ప్రాంతంలో వరద నీరు నిలిచిపోయి ఉంది. ఏవీ కాలేజ్ ,గగన్ మహల్ ఎగువ ప్రాంతం నుండి దిగువన ఉన్న దోమల గూడ, సూరజ్ నగర్ కాలనీ, రాజ్ మహల్ ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. మోటార్ ద్వారా స్టాగింగ్ అయిన వరద నీరు పంపించేటట్లు చూస్తామని అధికారులు చెబుతున్నారు.
ఇక భారీ వర్షానికి రెండు రోజులుగా హైదరాబాద్ వాసులు ట్రాఫిక్ నరకాన్ని అనుభవిస్తున్నారు. ఇది విశ్వనగరం కాదు విశ్వ నరకం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. చినుకు పడితే హైదరాబాద్ వాసులకు యమయాతన తప్పడం లేదని అంటున్నారు. వర్షం కురిస్తే చాలు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, ఇక నగరంలో ఎక్కడ చూసినా గంటలతరబడి ట్రాఫిక్ స్తంభించిపోవడం మామూలైపోయిందని అంటున్నారు.