సగం బెజవాడను కాపాడినది రైల్వే కట్టలేనా?
posted on Sep 9, 2024 6:22AM
బుడమేరు ముంపు కారణంగా సగం బెజవాడ మునిగిపోయింది. మిగిలిన సగం బెజవాడను ముంపు ముప్పు నుంచి కాపాడినది రైల్వే కట్టలేనా? అంటే స్థానికులు ఔననే చెబుతున్నారు. జనవాసాలలోకి నీరు చేరకుండా ఎత్తుగా ఉన్న ఈ రైలు కట్టలే అడ్డుకున్నాయంటున్నారు. కాజీపేట రైల్వే డివిజన్ కొండపల్లి వరకూ ఉంది. కొండపల్లి నుంచి విజయవాడ డివిజన్ మొదలౌతుంది.
ఆగస్టు.31 వతేదీ బుడమేరు ప్రవాహాన్ని కొండపల్లి, రాయనపాడు, విశాఖ వైపు నిర్మించిన లూప్ లైన్ అడ్డుకుంది.కవులూరు,రాయనపాడు, శాంతి నగర్ మధ్య బుడమేరు గండ్లు పడ్డాయి. ఆ ప్రవాహమే బెజవాడ ను ముంచెత్తింది. 1వ తేదీ సాయంత్రానికి విజయవాడ రైల్వేస్టేషన్ కు కి.మీ దూరంలో ఉన్న నైజాం గేటు వరకూ పట్టాలపైకి నీరు వచ్చింది. రాయనపాడు,కొండపల్లి రైల్వేస్టేషన్లు ఎత్తులో ఉండడంవల్ల ముంపుకు గురి కాలేదు.
సాధారణంగా రైల్వే లైన్లు దాదాపు ఆరు అడుగుల ఎత్తులో నిర్మిస్తారు. కోస్తా ప్రాంతంలో వ్యవసాయ భూములు ఉండడంవల్ల తరచూ వర్షాలు,వరదలు వచ్చే అవకాశం ఉండడంతో నాలుగు నుంచి ఐదు మీటర్ల ఎత్తులో నిర్మించారు. విశాఖమార్గంలో,విజయవాడలో లైన్ ఎత్తులో నిర్మించారు.35ఏళ్ల క్రితం విశాఖ మార్గంలో లూప్ లైన్ నిర్మించడంతో భద్రత పెరిగింది. రాజేశ్వరిపేట మీదుగా విశాఖ వెళ్లేమార్గంలో కొత్త లైన్ నిర్మాణంతో గూడ్స్ రైళ్లు మళ్లింపు జరుగుతున్నాయి.ఇటీవలకాలంలో అత్యవసరం సమయంలో ప్యాసింజర్ రైళ్లు నడుపుతున్నారు.ఈ లైన్ గుణదల, రామవరప్పాడు మీదుగా వెళుతుంది.పొడవైన ఈ లైన్ ఎత్తుగా ఉండడంతో వరదను అడ్డుకోవడమే కాక నగరం లోని మిగిలినప్రాంతాలు ముంపునకు గురికాకుండా అడ్డుకుంది.
ఇక పోతే బుడమేరు ముంపు బాధితులు ఆరున్నర లక్షల మంది గా భావిస్తున్నారు.194 పునరావాస కేంద్రాల్లో 45వేలమంది ఆశ్రయం పొందుతున్నారు.వరద దెబ్బకు 2900కి.మీ మేర రోడ్లు దెబ్బతిన్నాయి.రెండు లక్షల హెక్టార్ల మేరకు పంట పొలాలు మునిగాయి. 20వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అధికారిక లెక్కల మేరకు 20మంది మృతి చెందారు.