రంగంలోకి దిగిన రాహుల్ సేన

Rahul Gandhi,Rahul Gandhi Congress President, Rahul Latest News, Rahul Congress Party

 

దేశంలో ముందస్తు ఎన్నికల హల్ చల్ మొదలయ్యింది. బరిలోకి దిగిన రాహుల్ సేన గెలుపు గుర్రాలకోసం వేట మొదలుపెట్టింది. ఎవరెవరి సత్తా ఏంటి? ఎవరికి టిక్కెట్టిస్తే గెలుస్తారు? ఎవరెంత వేగంగా పనిచేయగలరు? ఎవరికి జనంలో పిచ్చ ఫాలోయింగ్ ఉంది?
ఎవరు విధేయత కలిగిఉంటారు? ఉన్నవాళ్లకే టిక్కెట్టివ్వాలా? లేక క్యాండిడేట్ ని మార్చాల్సొస్తే ఎవర్ని ఎంపిక చేసుకోవాలి? ఎవరికి అంగబలం, ఆర్థికబలం పుష్కలంగా ఉన్నాయ్? అనే విషయాల్ని 50మంది సభ్యుల రాహుల్ టీమ్ జల్లెడ పడుతుంది.

రాహుల్ ఎంపిక చేసుకున్న 50 మంది సభ్యుల టీమ్ లో ఏపీనుంచి ఏడుగురికి చోటు దక్కింది. రుద్రరాజు పద్మరాజు, కె.యాదవరెడ్డి, కందుల లక్ష్మీ దుర్గేశ్, భానుప్రసాద్, మాజీ  ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గంగా భవాని రాహుల్ సేనలో సభ్యులయ్యారు. ఒక రాష్ట్రానికి సంబంధించిన జట్టుని మరో రాష్ట్రానికి పంపి నిజాలను నిగ్గుతేల్చేందుకు రాహుల్ గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఏపీలో పర్యటించబోతున్న టీమ్ సభ్యుల వివరాలు మాత్రం బైటికి పొక్కడం లేదు.

ప్రజలతో ముఖాముఖీ మాట్లాడడం, వాళ్ల అభిప్రాయాల్ని తెలుసుకోవడం రాహుల్ సేన పని. జనసామాన్యంలో ఉన్న అభిప్రాయాల్ని కచ్చితంగా అలాగే రాహుల్ కి చేరవేయాల్సిన బాధ్యత కొత్త టీమ్ పై ఉంటుంది. కింది స్థాయి నేతలనుంచి, లోక్ సభ అభ్యర్ధులు, మాజీ లోక్ సభ అభ్యర్ధులు, మంత్రుల స్థాయివరకూ రాహుల్ సేన అభిప్రాయ సేకరణ చేస్తుంది. విలువైన సమాచారాన్ని క్రోడీకరించి రాబోయే రోజుల్లో కాబోయే ప్రథానమంత్రిగా కాంగ్రెస్ వర్గాలు బలంగా నమ్ముతున్న రాహుల్ కి అందచేస్తారు.

రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇంకా బాధ్యతలు చేపట్టనప్పటికీ ప్రథాన కార్యదర్శి హోదాను దాటి పనిచేస్తున్నారన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తోందని పార్టీలో సీనియర్ నేతలు చెప్పుకుంటున్నారు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న శుభపరిణామం దగ్గర్లోనే ఉందని, త్వరలో రాహుల్ చేతికి అధికార పీఠం దక్కబోతోందని సంబరపడుతున్నారు. అంతా సవ్యంగా ఉంటే, అవకాశం ఉందనుకుంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుక్కూడా రాహుల్ గాంధీ సమాయత్తమవుతున్నారన్న ఊహాగానాలు గట్టిగానే వినిపిస్తున్నాయ్.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu