రఘురామ రాజీనామా.. ఎప్పుడంటే!

మరో రెండు రోజులలో... జనవరి 31 (సోమవారం) నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. తొలి రోజున ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి  రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ ప్రసంగిస్తారు. మర్నాడు మంగళవారం ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, 2022-23 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెడతారు... ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన.. ఆపైన బడ్జెట్ పైన చర్చలు, రొటీన్ కార్యకలపాలు ఉంటాయి. 
అదలా ఉంటే, ఈ బడ్జెట్ సమావేశాల్లోనే, ఇంచుమించుగా రెండు సంవత్సరాలుగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామా కృష్ణం రాజు సాగిస్తున్న రచ్చబండ రాజకీయ పోరాటం కొత్త మలుపు తీసుకుంటుందని అంటున్నారు. నిజానికి, ఆయనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ, ఎప్పుడోనే స్పీకర్’కు ఫిర్యాదు చేసింది. పార్టీ గుర్తు పైన ఎంపీగా గెలిచి.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వైసీపీ పార్లమెంటరీ నేతలు స్పీకర్’కు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి.. లోక్ సభలో పార్టీ  ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి.. విప్ మార్గాని భరత్ పలు స్పీకర్’కు  ఆధారాలు సమర్పించారు.
అయినా ఎందుకనో స్పీకర్ కార్యాలయం స్పందించలేదు. ఈ నేపధ్యంలోనే రఘురామా వైసీపీకి సవాలు విసిరారు. దమ్ముంటే, చేతనైతే ఫిబ్రవరి 5 లోగా, స్పీకర్ తనను అనర్హునిగా ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని సవాలు విసిరారు. వైసీపీకి తనను అనర్హునిగా ప్రకటించేలా చేయడం చేతకాక పొతే, ఫిబ్రవరి 5 తర్వాత తానే రాజీనామా చేస్తానని చెప్పారు. అంతే కాదు నర్సాపురం నుంచి మళ్ళీ పోటీ  చేసి గెలుస్తానని చెప్పారు.  అదే విషయాన్ని ఆయన ప్రతి రోజు మళ్ళీ మళ్ళీ చెపుతూనే ఉన్నారు.మరో వంక రఘురామ అనర్హత విషయంలో ఇంతవరకు మౌనంగా ఉన్న, స్పీకర్ కార్యాలయంలో కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయంగా ఫ్రెష్’ గా వైసీపీ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ లోక్ సభ స్పీకర్ కు మరోమారు ఫిర్యాదు చేశారు. నార్సాపురం ఎంపీ  రఘురామ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని...పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఆయన పైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు లిఖిత పూర్వకంగానూ  ఫిర్యాదు చేశారు.ఆధారాలు సమర్పించారు. దీని పైన స్పందించిన లోక్ సభ స్పీకర్ తాజాగా ఈ పిటీషన్ ను ప్రివిలేజ్ కమిటీకి పంపారు. దీని పైన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. 
దీంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోగా అటో ఇటో నిర్ణయం రావచ్చని అంటున్నారు. అయితే, రఘురాం కృష్ణం రాజు అంతవరకు అగకుండా, ఫిబ్రవరి 5 ఒకటి రెండు రోజులు అటూ ఇటుగా ఎంపీ పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి రఘురామా రాజీనామా తథ్యమని చెపుతూనే ఉన్నారు. అలాగే మళ్ళీ అదే  నర్సాపురం నుంచి పోటీ చేస్తానని, భారీ మెజారిటీతో గెలుస్తానని చెపుతూనే ఉన్నారు. సో .. ఈ బడ్జెట్  సమావేశాల్లో రఘురామ రాజు రాజీనామా ఓకే హై లైట్’గా నిలుస్తుందని అంటున్నారు. 
అదలా ఉంటే రఘురామ కృష్ణం రాజు  ఎంపీ పదవికి, వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఏపార్టీలో చేరతారు? ఏపార్టీ టికెట్ మీద పోటీ చేస్తారు? అనేది మాత్రం ఇంతవరకు అయన చెప్పలేదు. అయితే, ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం అయితే బలంగా సాగుతోంది. అలాగే, ఆయన ఏ పటీలో చేరరని, ఉప ఎన్నికలవరకు అందరివాడుగా ఉండి పోతారని, ఇండిపెండెంట్  అభ్యర్ధిగా పోటీ చేస్తారని అంటునారు.

Related Segment News