ఆ పది కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాల పత్రాలు

తెలంగాణలో తొలివిడతగా 10 బీసీ కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాల పత్రాలు అందజేసేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గంగుల కమలాకర్ ఆ వివరాలు వెల్లడించారు. బీసీల్లోని పది కులాలైన 1) ఎల్లాపి, 2) మేదరి, 3) పెరిక, 4) నకాస్, 5) బసవేశ్వర లింగాయత్, 6) రంగ్రేజ్ భవసార, 7) అగర్వాల్ సమాజ్, 8) నీలి, 9) జాండ్ర, 10) తెలంగాణ మరాటి మండల్ కులాలకు సంబంధిత పత్రాలను ఫిబ్రవరి 2వ తేదీ, బుదవారం ఉదయం పదిగంటల నుండి ఒంటి గంట వరకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో అందజేస్తామని చెప్పారు. ఆ తరువాత ఆయా భవనాల నిర్మాణ పనులు ప్రారంభించి అతి త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. 

ఆయా కులాల్లో ఉన్న వివిధ సంఘాలన్నీ ప్రభుత్వం గతంలోనే కోరినట్టు ఏక సంఘంగా ఏర్పడి తమ సమ్మతిని తెలియజేశాయని, అందువల్ల ఆ నాయకులకు పత్రాలు అందజేస్తామన్నారు. గత డిసెంబర్లో అన్ని కుల సంఘాలతో సమావేశం నిర్వహించి బీసీ కులాల్లోని సంఘాలన్నీ ఆత్మగౌరవ భవనం కోసం ఏక సంఘంగా ఏర్పడి కామన్ రిజిస్టర్డ్ సంఘంగా లేదా ట్రస్టుగా లేదా అసోసియేషన్ గా ఏర్పడాలని సూచించామని, అలా ఏర్పడిన ఏక సంఘానికే తాము ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం అనుమతులు ఇస్తామని చెప్పినట్లు గుర్తు చేశారు. 

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని దాదాపు 5వేల కోట్ల విలువ చేసే 82 ఎకరాల స్థలాల్ని 41 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాల కోసం కేటాయించారు. అలాగే ఎకరాకు రూ. కోటి చొప్పున నిధులు విడుదల చేసి భవనాల నిర్మాణాల్లో ఆయా కులాలకే పూర్తి అధికారాలతో అనుమతులు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.