ఢిల్లీలో పీవీ స్మృతి చిహ్నం
posted on Apr 1, 2015 7:33AM
కాంగ్రెస్ పార్టీలో నెహ్రు కుటుంబ సభ్యులకు తప్ప ఇతరులకు ఎటువంటి ప్రాధాన్యత ఉండదు. కాంగ్రెస్ ప్రచార బ్యానర్లు, పోస్టర్లలో అది కళ్ళకు కట్టినట్లు కనబడుతుంటుంది. అందుకే మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహరావుగారికి కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి ప్రాధాన్యత లేకుండాపోయింది. ఒకానొక సమయంలో కాంగ్రెస్ పార్టీ చాలా క్లిష్ట పరిస్థితులో ఉన్నప్పుడు కేంద్రంలో మైనార్టీ ప్రభుత్వ బాధ్యతలు చేప్పట్టిన పీవీ నరసింహరావు ఐదేళ్ళపాటు ప్రభుత్వాన్ని సమర్ధంగా నడపడమే కాకుండా భారతదేశంలో ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టిన గొప్ప ప్రధాన మంత్రిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి కూడా పునర్జన్మ ఇచ్చిన మహానుభావుడనే సంగతిని కూడా విస్మరించిన కాంగ్రెస్ అధిష్టానం ఆయన మరణించిన తరువాత కనీసం అంత్యక్రియలు కూడా సక్రమంగా నిర్వహించ కూడా చనిపోయిన ఆ మహానుబావుడికి తీరని అపచారం చేసింది. కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలంపాటు సేవలు చేసిన ఆయనకు స్మారక చిహ్నం ఏర్పాటు చేయడానికి కూడ ఇష్టపడలేదు.
కాంగ్రెస్ పార్టీ ఆయనను గౌరవించకపోయినప్పటికీ, ఎన్డీయే ప్రభుత్వం ఆ మహానుభావుడికి దక్కవలసిన గౌరవమర్యాదలు కల్పించేందుకు, యమున నది ఒడ్డున ఏక్తా స్థల్ సమాధి కాంప్లెక్స్ సముదాయంలో పీవీ మెమోరియల్ ఘాట్ ని నిర్మించడానికి మంత్రిమండలి అమోదం కోసం పట్టణాభివృద్ధిమంత్రిత్వశాఖ ఒక ప్రతిపాదన పంపింది. ఆ ప్రతిపాదనకు కేంద్రమంత్రిమండలి ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ చేయలేని ఈ సత్కార్యాన్ని బీజేపీ చేయడం విశేషం. ఆయనకు ఎన్డీయే ప్రభుత్వం భారతరత్న అవార్డు కూడా ప్రకటించగలిగితే రెండు రాష్ట్రాలలో తెలుగు ప్రజలందరూ చాలా కూడా సంతోషిస్తారు.