జగన్నాథుని రథచక్రాలు సాగుతున్నాయి!!

భారతదేశం మొత్తం రథయాత్ర పేరుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే పూరీ జగన్నాథుని రథోత్సవం ప్రస్తుతం జరుగుతోంది. ఒడిశా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన వెలసిన పూరీ క్షేత్రం శ్రీకృష్ణుణ్ణి ఆరాధించే వాళ్లకు ఎంతో పవిత్రమైనది. చార్ ధామ్ యాత్రలో ఉన్న ప్రముఖ నాలుగు క్షేత్రాలలో ఒకటైన పూరి జగన్నాథుని రథోత్సవం ప్రత్యేకత, విశేషాలు మొదలైన వాటి గురించి తెలుసుకున్న కొద్దీ ఇంకా తెలుసుకోవాలని ఉంటుంది.

పూరీ క్షేత్రంలో ఎన్నో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. వాటిలో రథయాత్రకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. జగన్నాథుడు బలభద్రుడు, సుభద్రలతో కలసి ఇక్కడ రథాల మీద ఉరేగడం చాలా కన్నుల పండుగగా ఉంటుంది. రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి. దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. ఇక్కడి గొప్ప ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సంవత్సరం కొత్త రథాన్ని తయారుచేసి ఆ రథాల్లోనే రథోత్సవం జరుపుతారు. రథోత్సవాలు ఎక్కడ జరిగినా మూలవిగ్రహాలు వేరు, ఊరేగింపు విగ్రహాలు వేరు ఉంటాయి. కానీ పూరీ క్షేత్రంలో అలా కాకుండా  మూలవిగ్రహాలనే ఊరేగింపు చేస్తారు. కొత్త రాథాలపై మూల మూర్తులను చూడటం ఇక్కడే సాధ్యం. అందుకే పూరీ రథయాత్రకు ఇంత విశిష్టత ఏర్పడింది.


ఆషాడ శుద్ధ విదియ రోజున సంవత్సరం నుండి మూలమూర్తిగా పూజలందుకుంటున్న జగన్నాథుణ్ణి, బలభద్రుణ్ణి, సుభద్రని గర్భాలయంలో నుండి బయటకు తీసుకుని వస్తారు.


అథిత్యం గుండిచా వేదిక!!


పూరీజగన్నాథ ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో గుండిచా ఆలయం ఉంటుంది. ఇది పూరీ ఆలయాన్ని  నిర్మించిన ఇంద్రద్యుమ్నుడి భార్య గుండిచా కట్టించినది. పూరీ ప్రధాన గుంది నుండి మూడు కిలోమీటర్లు రథం మీద వెళ్లి గుండిచా ఆలయంలో రత్న సింహాసనం మీద కొలువవుతాడు జగన్నాథుడు.


రథం ప్రత్యేకత!!


అంతా ఎక్కువభాగం రథాల్లోనే ఉంది ప్రత్యేకత. రథం తయారీ కోసం 1072 వృక్ష భాగాలను పూరీకి తరలిస్తారు. అక్షయతృతీయ రోజు 125 మంది ఈ 1072 బాగాలను 2188 ముక్కలుగా చేస్తారు. వీటిలో 832 ముక్కలు జగన్నాధుడి రథం కోసం, 763 భాగాలు బలభద్రుడి రథం కోసం, మిగిలిన 593 భాగాలను సుభద్ర రథం కోసం కేటాయిస్తారు. వాటితో రథాలను తయారుచేయడం మొదలు పెడతారు. ఆషాడ పాడ్యమి నాటికి వీటి నిర్మాణం పూర్తవుతుంది. జగన్నాధుడి రథం 16 చక్రాలతో 45 అడుగుల ఎత్తుతో అన్నిటి కంటే పెద్దగా ఉంటుంది. ఎర్రటిచారలు ఉన్న పసుపు వస్త్రంతో దీన్ని కప్పుతారు. దీన్ని నందిఘోష అంటారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అని, సుభద్ర రథాన్ని పద్మధ్వజం అని అంటారు.


తిరుగు ప్రయాణం!!


రథాల మీద ఊరేగుతూ గుండిచా ఆలయాన్ని చేరుకున్న ఆతరువాత వారం రోజుల పాటు అక్కడే గడుపుతారు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ముగ్గురూ, వారం రోజుల తరువాత దశమి రోజు తిరిగి పూరీ ప్రధాన ఆలయానికి వెళతారు. దశమి తరువాత ఏకాదశి రోజున స్వామి వార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. మళ్ళీ ద్వాదశి రోజున విగ్రహాలను తిరిగి గర్భగుడిలోకి తీసుకెళ్లిపోతారు. దీంతో రథయాత్ర ముగుస్తుంది.

ఆసక్తికర విషయాలు!!


జగన్నాథుని రథోత్సవం జరిగేటప్పుడు రథాన్ని లాగుతున్నప్పుడు రథానికి ఏ అడ్డు వచ్చినా దాని ప్రయాణం ఆగదు. మనుషులు రథం కింద పడినా వేరే ఇతర సమస్యలు వచ్చినా కూడా రథాన్ని ఆపరు. 


రథాలను, మూలవిగ్రహాలను మొత్తం చెక్కతోనే తయారుచేస్తారు. ఇది ఎంతో విశిష్టమైన వేప చెట్ల నుండి తయారుచేస్తారు. చాలామంది రథానికి ఉపాయోగించే కలప గురించి, ప్రతి సంవత్సరం కొత్త రథాల గురించి వినగానే అన్ని చెట్లను నరికేస్తున్నారా అని కొంచెం వ్యతిరేకత చూపిస్తారు. కానీ నిజానికి రథాల కోసం ఎంతో ప్రత్యేకంగా వృక్షాలను పెంచుతారు. వాటినే రథాల కోసం వినియోగిస్తారు. 


8, 11, 19 సంవత్సరాలకు ఒకసారి మూలమూర్తుల విగ్రహాలను కూడా మార్పులు చేస్తారు. కొత్త చెక్క విగ్రహాలను తయారుచేసి, పాత వాటిని శాస్త్రోక్తంగా ఖర్మకాండలు జరుపుతారు. మనిషి జనన మరణాలకు ఇది గొప్ప సందేశాన్ని ఇస్తుందని కొందరి అభిప్రాయం.

◆ వెంకటేష్ పువ్వాడ.

Related Segment News