టీడీపీలోకి పురంధేశ్వరి.!!
posted on Oct 27, 2018 1:09PM

దగ్గుబాటి పురంధేశ్వరి.. ఎన్టీఆర్ కుమార్తెగానే కాకుండా తెలుగు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. కాంగ్రెస్ హయాంలో ఎంపీగా, కేంద్రమంత్రిగా పనిచేసారు. రాష్ట్ర విభజన అనంతరం పురంధేశ్వరి కాంగ్రెస్ ని వీడి బీజేపీలో చేరారు. అయితే బీజేపీలో ఎక్కడో ఆమె మార్క్ మిస్ అవుతుంది. అదీగాక ప్రత్యేకహోదా, విభజన హామీల విషయంలో ఏపీ ప్రజలు బీజేపీ మీద కోపంగా ఉన్నారు. విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో.. ఇంచుమించు బీజేపీ పరిస్థితి కూడా అలాగే తయారైంది. దీంతో ఆమె సైలెంట్ అయ్యారు. అయితే నందమూరి అభిమానులు మాత్రం.. పురంధేశ్వరి ఆమె తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీలో చేరితే బావుంటుందని ఎప్పటినుండో ఆశపడుతున్నారు. అయితే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే త్వరలో ఆ ఆశలు నెరవేరేలా కనిపిస్తున్నాయి.
పురంధేశ్వరి తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీలో చేరాలి అనుకుంటున్నారట. పురంధేశ్వరి కుమారుడు టీడీపీ నుంచి అయితేనే పోటీ చేస్తాను.. లేదంటే పోటీకి దూరంగా ఉంటానని చెప్తున్నారట. దీంతో పురంధేశ్వరి నందమూరి కుటుంబసభ్యుల ద్వారా టీడీపీలో చేరిక గురించి మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. తనకు టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కుమారుని రాజకీయ భవిష్యత్ కోసం అతనికి టిక్కెట్ ఇవ్వాలని అడుగుతున్నారట. 'పర్చూరు' నుంచి తన కుమారుడు బరిలోకి దిగితే సులువుగా విజయం సాధిస్తారని.. అదేవిధంగా దగ్గుబాటి కుటుంబం వల్ల ప్రకాశంలో పార్టీకి మరింత ఊపు వస్తుందని, వెంకటేశ్వరరావు కూడా సహకరిస్తారని చెప్తున్నారట. అయితే చంద్రబాబు మాత్రం పురంధేశ్వరి చేరికపై అంత సానుకూలంగా లేనట్టు తెలుస్తోంది. నందమూరి కుటుంబసభ్యులు, ముఖ్యంగా బాలకృష్ణ చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకొస్తే పురంధేశ్వరికి టీడీపీ డోర్స్ తెరుచుకునే అవకాశం ఉంటుంది. మరి పురంధేశ్వరి నిజంగానే టీడీపీలోకి రావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారా?.. ఒకవేళ మొదలుపెట్టినా ఆ ప్రయత్నాలు ఫలిస్తాయా? తెలియాలంటే కొంతకాలం వేచి చూడాలి.