అంతర్వేదిలో తీవ్ర ఉద్రిక్తత.. హిందూ సంఘాల ఆగ్రహం కట్టలు తెంచుకుంది
posted on Sep 8, 2020 6:22PM
తూర్పుగోదావరి జిల్లాలోని సుప్రసిద్ధ అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయం లో మంత్రుల పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంతర్వేది దేవస్థానానికి భారీగా చేరుకున్న విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, భజరంగదల్, హిందూ చైతన్య వేదిక తదితర సంఘాల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి చెందిన రథం శనివారం అర్ధరాత్రి దాటాక దగ్దమైన విషయం తెలిసిందే. ఈ ఘటనతో హిందూధర్మిక సంఘాల ఆగ్రహం కట్టలు తెంచుకొంది. ఆలయ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని హిందూ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఉదయం ఆలయం వద్దకు భారీ సంఖ్యలో చేరి నిరసనకు పూనుకున్నారు.
ఆలయం వద్దకు ర్యాలీగా బయలు దేరిన హిందూ సంఘాలను పాశర్లపూడి బ్రిడ్జీపై పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతులు లేవని తిరిగి వెళ్లిపోవాలని హెచ్చరించడంతో.. జైశ్రీరామ్ అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుపడినప్పటికీ హిందూ సంఘాల కార్యకర్తలు ఆలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు.
ఇదిలా ఉంటే అగ్నికి ఆహుతైన స్వామి వారి రథాన్ని పరిశీలించేందుకు మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, చెల్లుబోయిన వేణు వచ్చారు. ఈ నేపథ్యంలో హిందూ సంఘాలు ఆలయం లోనికి వచ్చేందుకు ప్రయత్నించడంతో ఆలయం హైటెన్షన్ నెలకొంది. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకువచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
రథం అగ్నికి ఆహుతవడానికి తేనెతుట్టె కారణమని చెప్పటంపై ధార్మిక సంఘ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రథం దగ్ధం అవటానికి కారణం కొబ్బరిచెట్టు ఎందుకెక్కావు అంటే దూడ మేతకు అన్నట్లుగా ఉందన్న రీతిలో చెబుతున్నారని మండిపడుతున్నారు. హిందూ ఆలయాలు ఒకరి హయాములో కూల్చితే మరొకరి జమానాలో కాల్చివేస్తున్నారని ఆరోపించారు. హిందూ దేవాలయాలు కూల్చిన ప్రతిసారీ ఏదో కారణం చూపి నేరస్తులను తప్పిస్తున్నారని, ఫలితంగా ఇదొక అలుసుగా మారిందని అగ్రహిస్తున్నారు. బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు కూడా పిచ్చివాళ్లకు కాల్చివేయ్యటానికి హిందు ఆలయాలు మాత్రమే తెలుసా అని ఆగ్రహంతో ప్రశ్నించారు. వెంటనే రధం నిర్మాణం ముఖ్యం కాదని,హిందూ ఆలయాలపై తరచూ ఇలాంటి దుశ్చర్యలు జరగటం వెనుక కారకులు,కారణాలు ఏమిటనేది తేల్చాల్సి ఉంది అని హిందు ధార్మిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.