ఎన్‌కౌంటర్‌ కు అనుమతులు ఉన్నాయి.. హరగోపాల్

 

వరంగల్ జిల్లా తాడ్వాయ్ లో జరిగిన ఎన్ కౌంటర్ ను నిరసిస్తూ వామపక్షాలు ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేపడదామని నిర్ణయించుకున్నసంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో వారు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన నేపథ్యంలో పోలీసులు వారిని ఎక్కడికక్కడ కట్టడి చేశారు. అయితే ఈ వ్యవహారంపై ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ అధికార పార్టీపై మండిపడ్డారు. ప్రజలను కట్టడి చేసి విధ్వంసాన్ని సృష్టించవద్దని.. అధికార పార్టీ చేసే ప్రతిఒక్క పని రికార్డు అవుతుందని అన్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ఏర్పడిన మొదటి ప్రభుత్వం.. అలాంటిది ఒకవేళ తెలంగాణ చరిత్ర కనుక రాస్తే మొదటి తెలంగాణ ప్రభుత్వ అనుసరించిన విధానాలు గురించి కూడా తప్పనిసరిగా చర్చించాల్సి ఉంటుందని అన్నారు. అంతేకాదు ఎన్ కౌంటర్ గురించి మాట్లాడుతూ పైనుండి అనుమతులు లేనిదే పోలీసులు ఎన్ కౌంటర్ చేయరని వ్యాఖ్యానించారు. ఎన్ కౌంటర్ చేయకూడదని.. వీలుంటే వారిని అరెస్ట్ చేయాలని.. న్యాయవ్యవస్థ ద్వారా వారిని విచారణజరిపించాలి అంతేకాని ఎన్ కౌంటర్ చేయడమేంటని ప్రశ్నించారు. అయితే ఇప్పుడు హరగోపాల్ చేసిన వ్యాఖ్యలపై పలు అనుమానాలు రేకెత్తున్నాయి. ఎన్ కౌంటర్ కు ప్రభుత్వం అనుమతి ఉందని హరగోపాల్ మాటల ద్వారా స్పష్టం అవుతుందని అభిప్రాయపడుతున్నారు.