ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్ అసహనం.. టీడీపీ ఓటమే కారణమా?

 

నేడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు 97వ జయంతి. ప్రతి ఏడాది ఎన్టీఆర్ జయంతి నాడు.. నందమూరి కుటుంబసభ్యులు, టీడీపీ అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. అయితే ఈసారి ప్రతి ఏడాదిలా ఎన్టీఆర్ ఘాట్ వద్ద అంత హంగామా ఏం జరగలేదనే చెప్పాలి. మరి ఏపీలో టీడీపీ ఘోరంగా ఓడిపోవడం వల్లనో ఏమో కానీ టీడీపీ శ్రేణులు ఈసారి అంతగా సందడి చేయలేదు. అంతేకాదు ఎప్పుడూ ఎన్టీఆర్ జయంతి నాడు ఘాట్ ని పూలతో అలంకరిస్తారు. ఈసారి అలాంటివేం లేవు. దీంతో తాత ఎన్టీఆర్ కి నివాళులు అర్పించడానికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర అసహనానికి గురయ్యారు.

తారక్ తెల్లవారు జామున 5.30గంటలకు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. అయితే అక్కడ ఎన్టీఆర్ సమాధి దగ్గర ఒక్క పువ్వు కూడా కనిపించలేదు. చుట్టూ చెత్త చెదారంతో ఉండడంతో అసహనానికి గురయ్యారు. వెంటనే అనుచరులను పిలిపించి పువ్వులను తెప్పించారు. అభిమానుల సహాయంతో ఘాట్ చుట్టూ అందంగా పూలతో అలంకరించారు. అనంతరం కొన్ని నిమిషాల వరకు మౌనంగా అక్కడే కూర్చున్న తారక్.. ఇక నుంచి తాత వర్థంతి, జయంతి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను తానే చూసుకుంటానని చెప్పారు.

అయితే ఇప్పుడు తారక్ గురించి ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. ఏపీలో టీడీపీ ఘోర ఓటమి తరువాత.. పలువురు టీడీపీ అభిమానులు తారక్ రాజకీయాల్లోకి రావాలని, టీడీపీ పార్టీకి పూర్వవైభవం తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. అయితే తారక్ కి ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందో లేదో తెలీదు కానీ తాజా సంఘటన మాత్రం అభిమానుల్లో ఆశ చిగురించేలా చేసింది. తాత వర్థంతి, జయంతి వేడుకల ఏర్పాట్లను తానే చూసుకుంటాను అని చెప్పిన తారక్.. తాత స్థాపించిన పార్టీని కూడా చూసుకుంటే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి తారక్ అసహనం కేవలం ఏర్పాట్ల పైనేనా, పార్టీ ఓటమిపై కూడా ఉందా?. తాతను అమితంగా ఆరాధించే తారక్.. భవిష్యత్తులో తాత స్థాపించిన టీడీపీని ముందుండి నడిపిస్తారేమో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu