ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా సమస్యలు పరిష్కారమే లక్ష్యం : డిప్యూటీ సీఎం భట్టి
posted on Dec 19, 2025 6:42PM

ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా సమస్యలు పరిష్కరమే లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజావాణి రెండో వార్షికోత్సవం సందర్బంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతు ఇప్పటివరకు 74 శాతం ఫిర్యాదులను పరిష్కరించినట్లు వెల్లడించారు. విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నా, ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ముందుకెళ్తున్నామని తెలిపారు. ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
అధికారానికి దూరమైన విపక్షం ఎన్ని విమర్శలు చేసినా.. తాము మరింత ముందుకు వెళ్తామన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో వనరులు ప్రజలకు ఉపయోగపడేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజావాణి విజయవంతం చేసిన చిన్నారెడ్డి, దివ్యాదేవరాజన్‌కు డిప్యూటీ సీఎం అభినందనలు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల సమస్యలను విని వాటికి పరిష్కారం చూపే ఈ ప్రజావాణి కార్యక్రమం నిజమైన ప్రజా పరిపాలనకు ప్రతిరూపమని ఆయన అన్నారు.
దేశంలో ఇంత సమర్థంగా ప్రజా గోడు విని పరిష్కరిస్తున్న కార్యక్రమం ఎక్కడా లేదని పేర్కొన్నారు.సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సాంకేతిక సహకారంతో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఏర్పాటు చేయడం ద్వారా మరింత పారదర్శకంగా ప్రజావాణి కొనసాగుతుంది. ప్రజల మేలు కోసం రాష్ట్రంలోని ప్రతి వ్యవస్థ పనిచేయడం మా ప్రభుత్వ లక్ష్యమని భట్టి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రజావాణి ఇన్‌ఛార్జి దివ్యదేవరాజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు లబ్ధిదారుల తమ అనుభవాల పంచుకున్నారు.