మీ తాళం చెవి ఎక్కడుంది??

టైటిల్ చూడగానే మన తాళం చెవి ఇంకెక్కడ ఉంటుంది మనదగ్గరే!! అనుకుంటున్నారా?? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. 

సరే!! మీరు అనుకున్నట్టే మీ ఇంటి తాళం చెవో, లేదా మీ బీరువా తాళం చెవో, లేక మీ టూ వీలర్ కావచ్చు, ఫోర్ వీలర్ కావచ్చు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్న మీ మొబైల్ కావచ్చు ఇలా ఇవన్నీ కూడా మీ ఆధీనంలో ఉన్నా వాటి తాళం చెవి లేదా వాటిని వాడటానికి  ఇతరుల అనుమతి తీసుకోవాలని ఇతరులు మీతో చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది?? 

నా వస్తువు నేను వాడుకోవడానికి ఇతరుల అనుమతి ఏంటి?? అని అనిపించవచ్చు కదా!!

మరి వస్తువు మన సొంతమైనప్పుడు, దాన్ని మనం డబ్బు పెట్టి కొన్నప్పుడు దాని విషయంలో సర్వ హక్కులు మనకే ఉండాలన్నది సబబే!! 

మరి అలాగే మీ జీవిత తాళం చెవి ఎక్కడుందో ఒక్కసారి గుర్తుచేసుకోండి ఇప్పుడు.

జీవిత తాళం చెవి ఏమిటి విచిత్రంగా అనిపిస్తుందా?? 

అవును ఒక వస్తువు నాది అని చెప్పుకోవడానికి ఆ వస్తువు మీద సర్వ హక్కులను ప్రదర్శిస్తూ, నచ్చినట్టు వాడుతూ ఉంటారు కదా. మరి మీ జీవితం మీద మీరు పూర్తిగా హక్కు కలిగి ఉన్నారా అనే విషయం ఆలోచించండి మరి. ఇతరుల ప్రమేయం లేని జీవితాలు చాలా తక్కువ. ఎవరూ తమ జీవితాన్ని తాము సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడం లేదు అనేదానికంటే ఇతరుల చేతుల్లో ఉంచి ముందుకు నడుస్తున్నారు అనుకోవడం మంచిదేమో కదా!! కాస్త ఆలోచించి చూస్తే అదే నిజమని నమ్ముతారు కూడా. ఇలా తమ జీవితం తమ కంట్రోల్ లో లేక ఇతరుల ప్రమేయంతో ముడిపడి, లేక సమాజంతో ముడిపడి, తమకేం  కావాలో తెలుసుకోకుండా సమాజానికి తగ్గట్టుగా ఉండటం ఉత్తమ వ్యక్తిత్వం అనుకుంటారు కానీ తమ జీవితంలో కోల్పోతున్నది చివరలో మాత్రమే అర్థమవుతుంది వాళ్లకు. అలాంటి వాళ్ళ జీవితంలో ఎలాంటి ప్రత్యేకత లేకుండా, ఎలాంటి సొంత అభిరుచులు, అభిప్రాయాలు లేకుండా ఒకానొక యంత్రంలా సాగుతూ ఉంటుంది. 

ఒకటి చదవాలని ఇష్టం ఉంటుంది కానీ ఎవరో సలహా ఇస్తారు అదొద్దు ఇది చదువు అని, అలాగే అటువైపు వెళ్తారు. మరొకరు అలా ఉండకు ఇలా ఉండు అంటారు, ఇంకొకరు కుటుంబ విషయాలలో జోక్యం చేసుకుని సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు. కొందరేమో అనుభవంతో చెబుతున్నాం అంటూ లెక్చర్  ఇస్తారు. ఇట్లా ఈ పరంపర కేవలం ఒక విషయంతోనో, ఒకరోజుతోనో ఆగిపోకుండా పూర్తిగా మనిషి మానసిక విషయాల్లో కూడా చొచ్చుకు వస్తుంది. ఎంతగా అంటే జీవితాల్లో జరిగే ప్రతిదానికి ఇతరులు ముందుకొచ్చి మాట్లాడేంతగా, ప్రతి విషయాన్ని ఇతరులు తమ చేతుల్లోకి తీసుకుని జడ్జ్ చేసేంతగా. ఇలా ఇంకొకరు మీ జీవితాన్ని కంట్రోల్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం??

మొబైల్ ఫోన్ ను అడగకుండా ఇతరులు తీసుకుని వాడతారనో, లేక అందులో కాస్త పర్సనల్ విషయాలు ఉంటాయనో ఫోన్ లాక్ పెట్టుకుంటున్న వాళ్ళం జీవిత తాళం చెవిని మాత్రం ఇతరుల చేతుల్లో అంత సులువుగా ఎందుకు పెట్టేస్తున్నాం?? ఎప్పుడైనా ఆలోచించారా?? 

కొలీగ్స్ ఏమనుకుంటారనో, పక్కింటి వాళ్ళు ఏదో అనుకుంటారనో, ఇతరులు విమర్శిస్తారనో ఇలా ఎన్నో కారణాల వల్ల జీవితాల్లో ఎంతో విలువైన విషయాల్లో కొన్ని నిర్ణయాలను మార్చేసుకుంటూ ఉంటారు చాలామంది. జీవితం అనేది సమాజ ఆమోద యోగ్యమైనదిగా లేకపోయినా పర్వాలేదు అని చెప్పడం లేదు ఇక్కడ. ఎవ్వరికీ నష్టం కలిగించనతవరకు ఎలాంటి సమస్య ఉండదు కదా!! ఇక్కడున్న చిక్కల్లా మరొకరి జీవితంలోకి దూరి వారి విషయాలను జడ్జ్ చేసేయడం అనే అత్యుత్సాహం మరియు తమ జీవితం కంటే ఇతరుల జీవితం గూర్చి ఉన్న కుతూహలం కూడా కారణం కావచ్చు. ఫలితంగా జరుగుతున్నది ఒకటే ఎవరి జీవితం ఆశించినట్టు లేకుండా గందరగోళంగా  సాగిపోతోంది. ఎందుకు ఈ గందరగోళం అంటే ఎవరికి తొందరగా సమాధానం బయటకు రాదు. కానీ, ఒక్కసారి కాస్త ఆలోచిస్తే తెలుస్తుంది తమ జీవిత  నిర్ణయాలను తీసుకునే అవకాశం, తమకు లేకపోగా ఇతరుల చేతుల్లో నిర్ణయాలు జరిగిపోవడమే అని.

అందుకే మరి జీవితాలు ఎలాంటి గందరగోళానికి గురవ్వకుండా సాగాలి అంటే ఎవరి జీవిత తాళం చెవి వారిదగ్గరే ఉండాలి. తద్వారా ఎవరి సాధ్యాసాధ్యాలు వారికి తెలుస్తాయి. ఎవరి లక్ష్యాలు వారు సక్రమంగా నెరవేర్చుకోగలుగుతారు. 

ఇప్పుడు ఆలోచించండి. మీ తాళం చెవి ఎక్కడుంది?? ఎక్కడున్నా సరే దాన్ని చేజిక్కించుకోవలసినది మీరే!! ఒకవేళ మరొకరి జీవిత తాళం చెవి మీ దగ్గర ఉంటే వారిది వారికి ఇచ్చేయండి. ఇవేమీ ఆర్థిక కార్యకలాపాలు కాదు, జీవితాలు అనే విషయం మర్చిపోకండి. 

◆ వెంకటేష్ పువ్వాడ