వాళ్ల ఓట్ల కోసం గులాబీ వ్యూహాలు! పోసాని పాచిక పారేనా?
posted on Nov 21, 2020 4:33PM
గ్రేటర్ ఎన్నికల్లో సెటిలర్ల ఓట్లపై గులాబీలో గుబులుందా? పవన్ ఎంట్రీతో తమకు కష్టమని కారు పార్టీ నేతలు కంగారు పడుతున్నారా? పోసానితో ప్రయోజనమెంత? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కీలకంగా మారిన సెటిలర్ల ఓట్ల కోసం ప్రధాన పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. సీమాంధ్ర ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కలిసి వచ్చే అన్ని అవకాశాలను పార్టీలు వాడేసుకుంటున్నాయి. అందులో భాగంగానే టీఆర్ఎస్ కు మద్దతుగా సినీ నిర్మాత, దర్శకుడు పోసాని కృష్ణమురళి ప్రకటన చేశారని చెబుతున్నారు. హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించిన పోసాని.. గ్రేటర్ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేయాలని పిలుపిచ్చారు.
గ్రేటర్ ఎన్నికల సందర్భంగా పోసాని కృష్ణమురళి చేసిన ప్రకటనపై జోరుగా చర్చ జరుగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో కీలకంగా ఉన్న సెటిలర్ల ఓట్ల కోసమే టీఆర్ఎస్ పెద్దలు పోసానితో మాట్లాడించారనే వాదన వస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తానని కూడా చెప్పారు. పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తే సెటిలర్ల ఓట్లు బీజేపీ వైపు మళ్లవచ్చని అధికార పార్టీ ఆందోళన పడుతుందని తెలుస్తోంది. అందుకే పవన్ ప్రకటన చేసిన మరునాడే పోసాని మీడియా ముందుకు వచ్చారని చెబుతున్నారు. తన ప్రసంగంలో ఆంధ్రావారి గురించి పదేపదే మాట్లాడారు పోసాని. తెలంగాణలో ఆంధ్రావారంతా సురక్షితంగా ఉన్నారని చెప్ప ప్రయత్నం చేశారు. ఉద్యమ సమయంలోనూ కేసీఆర్ కు ఆంధ్రా నాయకులే మీదే కోపం ఉండేదని, ఆంధ్ర అంటే కాదన్నారు పోసాని. కేసిఆర్ వస్తే ఆంధ్రవారిని తరిమి కొడతారని ప్రచారం జరిగిందని.. కానీ తెలంగాణ వచ్చాక ఏ ఒక్క ఆంధ్రవారి మీద దాడి జరిగిన ఘటనలు లేవన్నారు పోసాని.
బీజేపీకి మద్దతూ తెలుపుతూ మాట్లాడిన పవన్ కల్యాణ్.. హైదరాబాద్ ను సురక్షితంగా ఉంచే వారినే గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. హైదరాబాద్ భద్రతపై పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు పోసాని. కేసీఆర్ పాలనలో హైదరాబాద్ భద్రంగా ఉందని చెప్పారు. 35 ఏండ్లుగా హైదరాబాద్ లో ఉంటున్నానని, గతంలో హైదరాబాధ్ అంటే మత కల్లోలాలు గుర్తొచ్చేవని, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మత కల్లోలాలు ఆగిపోయాయని చెప్పారు పోసాని. ఎన్టీఆర్ తరువాత హైదరాబాధ్లో కేసీఆరే మత కల్లోలాలు లేకుండా చేశారన్నారు. గతంలో ఆంధ్ర తో పోలిస్తే తెలంగాణలో పచ్చదనం ఉండేది కాదని ..కానీ కేసిఆర్ వచ్చాకా తెలంగాణ అంతా పచ్చగా మారిందన్నారు. దీంతో పవన్ కల్యాణ్ ప్రభావం సెటిలర్ల పడకుండా ఉండేందుకే.. టీఆర్ఎస్ కు మద్దతుగా పోసాని కృష్ణమురళి ప్రకటన చేశారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సెటిలర్ల ఓట్లు కీలకంగా మారాయి. దాదాపు 60 డివిజన్లలో గెలుపు ఓటములను నిర్ణయించే స్థాయిలో సీమాంధ్రులు ఉన్నారు. 2016 గ్రేటర్ ఎన్నికల్లో మెజార్టీ సెటిలర్ ఓటర్లు అధికార పార్టీకి మద్దతుగా నిలిచారని చెబుతారు. ఇప్పుడు కూడా వారి ఓట్లను గంప గుత్తగా తమవైపు తిప్పుకునేందుకు అధికార పార్టీ ఎత్తులు వేస్తుందని తెలుస్తోంది. అందుకే మంత్రి కేటీఆర్ కూడా హైదరాబాద్ ప్రగతి నివేదిక విడుదల చేస్తూ.. సెటిలర్ల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. తాము కూడా సిద్దిపేట నుంచి వచ్చి హైదరాబాద్ లో సెటిలయ్యామని చెప్పారు. హైదరాబాద్ లో ఉన్నవారంతా తమవారేనని చెప్పారు కేటీఆర్. గ్రేటర్ ఎన్నికల్లో 8 మంది సెటిలర్లకు టికెట్లు ఇచ్చామని వెల్లడించారు. పోసాని కృష్ణమురళికి నిక్కచ్చిగా పేరుంది. తాను చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా చెప్పేస్తారని, ఎలాంటి దాపరికం లేకుండా మాట్లాడుతారనే అభిప్రాయం ఆయనపై ప్రజలకు ఉంది. అయితే గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని పోసాని చేసిన ప్రకటనపై ప్రజలు ఎలా స్పందిస్తారన్నది మాత్రం చెప్పలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.