జనం లేని సేన, సైన్యం లేని సేనాని.. పవన్ పై మరోసారి విరుచుకు పడ్డ టీఆరెఎస్
posted on Nov 21, 2020 6:54PM
నిన్నటి వరకు జనసేనాని పవన్ కళ్యాణ్ ను పల్లెత్తు మాట అనని టిఆర్ఎస్ నేతలు.. జిహెచ్ఎంసి ఎన్నికలలో బీజేపీకి జనసేన మద్దతు ప్రకటించగానే ఆయనపై తీవ్రమైన వ్యాఖ్యలతో విరుచుకు పడుకున్నారు. ఈరోజు ఉదయం టీఆరెఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పవన్ పై మాటల దాడి చేయగా తాజాగా మంత్రి నిరంజన్ రెడ్డి ఇటు పవన్ కళ్యాణ్, అటు బీజేపీ పై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. తెలంగాణపై అవమానకర రీతిలో మాట్లాడిన పార్టీ బీజేపీ అని ఆయన మండిపడ్డారు. పార్లమెంటులో తలుపులు మూసేసి బిల్లును ఆమోదించి, తల్లిని చంపి బిడ్డను కన్నది అంటూ తెలంగాణను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసింది బీజేపీ నేతలు కాదా అని అయన నిలదీశారు.
ఇటువంటి బీజేపీ నేతలకు నాయకుడు ప్రధాని మోదీ.. ఆ పార్టీ వాళ్లు ఈరోజు జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. మరో పక్క జనసేన పార్టీ నాయకుడ్ని ఎపిలో ఛీకొట్టారు. తెలంగాణ ఇచ్చినందుకు తాను 11 రోజులు అన్నం తినలేదని చెప్పిన నాయకుడు పవన్. ఆయనకు తెలంగాణపై అంతగొప్ప ప్రేమ ఉంది. "జనసేన అనేది జనం లేని సేన, ఆయన సేనలేని సేనాని" అంటూ పవన్ ను అయన పార్టీని ఎద్దేవా చేసారు. తెలంగాణపై తమ విషం కక్కడానికే అయన బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. అంతేకాకుండా "ప్రజాక్షేమం కోసం బేషరతుగా జిహెచ్ఎంసి ఎన్నికల బరి నుంచి విరమించుకుంటున్నాం అని పవన్ చెప్పారు. అయితే అయన ఏ ప్రజల క్షేమం కోసం ఈ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారో చెప్పాలి" అంటూ నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.