తెలంగాణ ఆవిర్భావ వేడుకల పేర రాజకీయ రేస్!

తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల విషయంలో రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలూ పొలిటిల్ మైలేజీ కోసం పోటీ పడుతున్నాయి. తెలంగాణ సాధించింది మేమేనంటూ బీఆర్ఎస్, తెలంగాణ ఇచ్చింది సోనియమ్మేనంటూ కాంగ్రెస్, అన్ని విధాలుగా సహకరించింది మేమేనంటూ బీజేపీ పోటాపోటీగా ఉత్సవాల నిర్వహణకు సమాయత్తమౌతున్నాయి.

తెరాసగా ఉన్నంత వరకూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కర్త, కర్మ, క్రియ అంతా ఆ పార్టీ క్రెడిట్ లో వేసుకుంది. అయితే ఎప్పుడైతే జాతీయ రాజకీయాలంటూ కేసీఆర్ టీఆర్ఎస్ ను కాస్తా బీఆర్ఎస్ గా మార్చేశారో.. అప్పటి నుంచీ తెలంగాణ కార్డ్ ఆ పార్టీకి పెద్దగా కలిసి రావడం లేదు. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడంలో మాదే కీలక పాత్ర అని గత ఎనిమిదేళ్లుగా ఎంతగా చెప్పుకున్నా బీజేపీకి పెద్దగా ప్రయోజనం లేకపోయింది.  అయితే ఎప్పడైతే టీఆర్ఎస్ తన పార్టీ పోరులోని తెలంగాణను తీసేసి భారత్ చేర్చిందో అప్పటి నుంచి బీజేపీ తెలంగాణ సాధనలో తమ పాత్ర విస్మరించడం సాధ్యం కాదంటూ గట్టిగా గళమెత్తింది. అందుకు ప్రజల నుంచి కూడా సానుకూలత వ్యక్తం అవుతున్నదని పరిశీలకులు చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ సోనియమ్మే తెలంగాణ ఇచ్చిందని గతంలో ఎంతగా చెప్పుకున్నా విశ్వసించని తెలంగానం ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తరువాత కాంగ్రెస్ మాటలకు ఔను కదా అంటూ స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ వేడుకల నిర్వహణలో మూడు పార్టీలూ పోటీ పడుతున్నాయి.

బీఆర్ఎస్ ఈ వేడుకలు మూడు వారాలు నిర్వహించాలని నిర్ణయిస్తే.. కేంద్ర  ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ ఏడాది గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సాంస్కృతిక శాఖ ఈ ఉత్సవాలను నిర్వహిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.

అంతే కాకుండా తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తామనీ, ఆయా రాష్ట్రాల్లో నివసించే తెలంగాణ ప్రజలను రాజ్‌భవన్లకు ఆహ్వానించి, గవర్నర్ల ఆధ్వర్యంలో ఆవిర్భావ ఉత్సవాలను నిర్వహిస్తామని ప్రకటించారు.  ఇక కాంగ్రెస్ సోనియాగాంధీ చలవ వల్లే తెలంగాణ ఆవిర్భవించిందన్న ప్రచారంతో ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించింది.