కేటీఆర్ హీరోగా ‘పొలిటికల్ పిచ్చోడు’
posted on Apr 13, 2024 1:47PM
సినిమావాళ్ళు ఎవరైనా ‘పొలిటికల్ పిచ్చోడు’ అనే పేరుతో సినిమా తీయాలని అనుకుంటే, ఆ సినిమాలో హీరోగా యాక్ట్ చేయడానికి ఒక రాజకీయ నాయకుడు అన్నివిధాలా అర్హుడు. అతనెవరో ఈపాటికి మీకు అర్థమైపోయిందిగా.. ఎస్... అతనే కేటీఆర్ అలియాస్ కల్వకుంట్ల తారక రామారావు. కేటీర్
వ్యక్తిగతంగా పిచ్చోడు కాదు.. బాగా చదువుకున్నవాడు.. మాటకారి, సబ్జెక్ట్ వున్నవాడు. వ్యక్తిగతంగా కొంచెం కూడా మెంటల్ లేదు. పొలిటికల్‌గా మాత్రం కేటీఆర్ పెద్ద పిచ్చోడు. అందుకే ‘పొలిటికల్ పిచ్చోడు’ అనే మాటకి కరెక్ట్.గా సూటవుతాడు. కేటీఆర్ పొలిటికల్ పిచ్చితనం గురించి పదేళ్ళకు పైగానే అందరికీ తెలుసు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఆ పిచ్చితనం మరింతగా ప్రకోపించి పీక్స్.కి చేరుకుంది.
శుక్రవారం (ఏప్రిల్ 12) ఒక ప్రముఖ టీవీ ఛానల్‌కి ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఈ విషయంలో మరింత క్లారిటీ వచ్చింది. ఇంటర్వ్యూ మొదలైన దగ్గర్నుంచి పూర్తయ్యే వరకు కేటీఆర్ చెప్పిందే చెప్పి తన రాజకీయ వాచాలత్వాన్ని ప్రదర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక మీరు వున్నారా? అని అడిగితే నాకు సంబంధం లేదు అని సమాధానం చెప్పి, అక్కడితో ఆగకుండా పలువురు ఐపీఎస్ అధికారుల పేర్లు ప్రస్తావించి, వాళ్ళకి కూడా సంబంధం వున్నట్టే కదా అంటారు. ఇదేం డొక్కులో లాజిక్కో అర్థం కాదు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో నేను లై డిలెక్టర్ పరీక్షకి రెడీ.. కానీ, నాతోపాటు సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా లై డిలెక్టర్ పరీక్షకి కూర్చోవాలి అంటారు. అది కాదయ్యా, నువ్వొక్కడివే లై డిటెక్టర్ పరీక్ష చేయించుకుని సుద్దపూసలా బయటపడొచ్చు కదా.. మధ్యలో వాళ్ళనెందుకు లాగుతావు?
ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ ఇంకా చాలా సెకలు ప్రదర్శించారు. ఫలానా సమయంలో ఫలానా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు.. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ నాయకులే చేశారు అంటూ సోది చెప్పుకొచ్చారు. మీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందా లేదా అంటే మాత్రం చేసింది లేదా చేయలేదు అని తేల్చకుండా, నాకు మాత్రం సంబంధం లేదు అని అంటారు. అక్కడితో ఆగకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్లను ట్యాప్ చేస్తోందని మాటమాటకీ అన్నారు. ఇలా డొంకతిరుగుడుగా మాట్లాడుతూ కేటీఆర్ చాలా తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటూ వుండవచ్చు. కానీ ఆయన మాట్లాడుతున్న తీరు ఆయన రాజకీయ అజ్ఞానాన్ని, రాజకీయ అహంకారాన్ని స్పష్టంగా బయటపెట్టింది.
యాంకర్ ఏదైనా కీలకమైన ప్రశ్న అడిగితేచాలు... ఓ పేపర్ని కెమెరాకి చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలు నెరవేర్చలేదని రాగం అందుకున్నారు. మీకు అహంకారం ఎక్కువైపోయిందని అందరూ అనుకుంటున్నారని అంటే, నేను అస్సలు అహంకారినే కాదు అంటూ అహంకారంగా సమాధానం చెప్పారు. అంచేత, ఎవరికైనా ‘పొలిటికల్ పిచ్చోడు’ అనే సినిమా తీయాలన్న ఇంట్రస్ట్ వుంటే కేటీఆర్ని సంప్రదించవచ్చు.