కన్నీరు... కొంగుచాచడం.. ఏంటిది?
posted on Apr 13, 2024 1:12PM
కడప పార్లమెంట్ స్థానానికి పోటీకి దిగి, జగనన్నతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైన షర్మిల ప్రచారపర్వంలో వున్నారు. ఈ ప్రచారంలో భాగంగా షర్మిల తనను గెలిపించాలని ప్రజలను పావలా శాతం కోరుతూ, మిగతా ముప్పావలా శాతాన్ని జగనన్నని తిట్టడానికి వినియోగిస్తున్నారు. షర్మిలమ్మ పక్కనే వివేకా కుమార్త సునీత కూడా వుంటున్నారు. ఇద్దరూ కలసి జగనన్నని డబుల్ డోస్‌లో తిడుతున్నారు.
తాజాగా పులివెందులలో ప్రచారానికి వెళ్ళిన షర్మిలమ్మ జగన్నని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. వివేకా హంతకుడికి మద్దతు ఇవ్వడం మాత్రమే కాదు... పరిపాలన విషయంలో జగనన్న పూర్తిగా ఫెయిలయ్యారని విమర్శించారు. అధికారం ఇస్తే తండ్రి ఆశయాలను కొనసాగిస్తానని చెప్పిన జగన్, అధికారం వచ్చాక తండ్రి ఆశయాలను అటక ఎక్కించారని షర్మిల విమర్శించారు.. అంతేనా, పెండింగ్ ప్రాజెక్టుల మీద, మూడు రాజధానుల మీద, ఉద్యోగాల కల్పన మీద, తప్పిన హామీల మీద.. ఇలా చాలా పాయింట్ల మీద జగనన్న దుమ్ము దులిపి వదిలిపెట్టారు. టోటల్‌గా జగనన్న ‘పులివెందుల పిల్లి’ అని తేల్చేశారు.
ఇంతవరకు బాగానే వుందిగానీ, ఆ తర్వాతే సిట్యుయేషన్లో మార్పు వచ్చింది. అప్పటి వరకు పులివెందుల సివంగిలా గర్జించిన షర్మిల సడెన్‌గా బేలగా మారిపోయారు. కన్నీరు పెట్టేసుకున్నారు.. దీనంగా మాట్లాడ్డం ప్రారంభించారు. కొంగుచాచి అడుగుతున్నా.. నన్ను గెలిపించండి అని ప్రాధేయపడ్డారు. అసలు షర్మిల నుంచి ఇలాంటి బేలతనాన్ని ఊహించని పులివెందుల జనాలు బిత్తరపోయారు. అన్నని పులివెందుల పిల్లి అంటూ గర్జించిన షర్మిల ఇంతలోనే తానే మ్యావ్ అనడమేంటా అని ఆశ్చర్యపోయారు.
చూడమ్మా షర్మిలమ్మా... మొన్నటి వరకూ నేను తెలంగాణ కోడల్ని అని అక్కడ రాజకీయాల్లో హడావిడి చేసి, ఎన్నికల సమయంలో సైడైపోయావు. ఇప్పుడు ఏపీ కూతుర్ని అని అక్కడకి ఎంటరయ్యావు. అడ్రస్పే లేని కాంగ్రెస్ పార్టీకి చీఫ్ అయ్యావు. కడప పార్లమెంటు సీటుకి పోటీ చేయడం ద్వారా అన్నమీద పగ తీర్చుకునే అవకాశాన్ని పొందావు. నువ్వు గెలుస్తావా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, జగనన్నకి కంట్లో నలుసులా మారావనే పాయింట్ నిన్ను చాలామంది అభిమానించడానికి కారణమైంది. అలాంటి ఇప్పుడు నువ్విలా సడెన్‌గా బేలతనంలోకి జారిపోతే ఎలాగమ్మా? నీ దృష్టిలో జగనన్న పులివెందుల పిల్లే కానీ, మీ నాన్న మాత్రం పులివెందుల పులే కదా.. ఆ పులిబిడ్డలాగా పోరాటం చేసి, జగనన్నని ఓటమిపాలు చేయడంలో నీవంతు పాత్ర పోషించాలిగానీ, ఇలా బేలతనంతో బతిమాలుకోవడం ఏంటమ్మా?