పొలిటికల్ కామెడీ.. కేఏపాల్ ను మించిపోయిన జగన్!

పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరిన సమయంలో కూడా చల్లటి వినాదాన్ని పంచగల దిట్ట ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏపాల్ మాత్రమేనని ఇంత కాలం అందరూ భావిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు  ఏపీ ఎన్నికల ముంగిట అధికార పార్టీ అదినేత వైఎస్ జగన్ పొలిటికల్ కామెడీని పండించడంలో పాల్ ను మించిపోయాడని అంటున్నారు. ఔను వైఎస్ జగన్ ఇటీవలి కాలంలో తన మాటలు, చేతలు, ప్రసంగాలలో కామెడీని బ్రహ్మాండంగా పండిస్తున్నారు.   తన హయాంలో జరిగిన సర్వ తప్పిదాలనూ తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఆపాదిస్తూ.. ఐదేళ్లలో తన వైఫల్యానికి కారణం చంద్రబాబే అని చెబుతూ నవ్విస్తున్నారు. అధికారంలోకి రాగానే మూడు రాజధానులంటూ హడావుడి చేసి చివరకు ఒక రూపుదాల్చిన రాజధాని అమరావతిని నిర్వీర్యం చేయడమే కాకుండా... రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా తాను మిగల్చిన జగన్.. తన వైఫల్యానికి కూడా చంద్రబాబే కారణమని చెబుతున్నారు. అదెలాగో స్వయంగా ఆయన చెప్పిన మాటలు వింటే దుర్వాసుడైనా పగలబడి నవ్వి తీరతాడు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ వదిలి వచ్చేసి చంద్రబాబే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసేశారట. ఔను ఆయన అలా చేయకుండా ఉండి ఉంటే తాను అమరావతిని నిర్వీర్యం చేసినా, మూడు రాజధానులు కాదు కదా ఒక్క రాజధినికి ఒక్క ఇటుకముక్క కూడా పేర్చలేకపోయినా.. హైదరాబాద్ ఉండేది కదా అంటున్నారు. 

ఔను సోమవారం (ఏప్రిల్ 29) చోడవరంలో  మాట్లాడుతూ  జగన్ హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కాదని చంద్రబాబు రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారని విమర్శించారు.  అమరావతిలో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వీటన్నిటి గురించి ఆయన మరచిపోవడమే కాకుండా, ప్రజలూ మర్చిపోవాలని అంటున్నారు. అదే సచివాలయంలో తన ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగుతున్నా, అసెంబ్లీ సమావేశాలను చంద్రబాబు నిర్మించిన భవనంలోనే నిర్వహిస్తున్నా. జగన్ ప్రభుత్వ తప్పిదాలకు మొట్టికాయలు వేస్తున్న హైకోర్టు కూడా చంద్రబాబు రాజధాని అమరావతిలో నిర్మించిన భవనంలోనే సాగుతోందని తెలిసినా జగన్ మాత్రం హైదరాబాద్ వదిలేసి చంద్రబాబు తప్పు చేశాడని నిందిస్తుంటే వినేవాళ్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. 

ఇక మనమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా విజయవాడలో పర్యటిస్తుండగా జగన్ పై జరిగిన గులకరాయి హత్యాయత్నం గురించి జగన్ చెబుతున్న మాటలు, చేస్తున్న చేష్టల గురించైతే ప్రజలు గుర్తుకు తెచ్చుకుని మరీ పడీపడీ నవ్వుతున్నారు.  దెబ్బ తగిలిన తొలి రోజు చిన్నసైజు ప్లాస్టర్ వేసుకున్న జగన్, ఆ తర్వాత పెద్ద సైజు పట్టీతో దర్శనమిచ్చారు.  అంతే కాదు ఆ పట్టీని ఆయన దాదాపు 13 రోజుల పాటు ధరించి కాదు కాదు భరించారు.  డాక్టర్ చెల్లెమ్మ సునీత   జగనన్నా  గాయంపై రోజుల తరబడి పట్టీ ఉంచుకుంటే సెప్టిక్ ఔతుంది జాగ్రత్త అని హెచ్చిరించడంతో భయపడి తీసేశారు. అయినా గులకరాయి హత్యాయత్నం ఘటనలో గాయపడిన జగన్ కు చికిత్స చేసి కుట్లు వేసి మరీ బ్యాండేజీ వేసిన నిపుణులైన గవర్నమెంట్ వైద్యుల బృందానికి ఆ విషయం తెలియదు పాపం. నిజానికి కార్డియాలజిస్టు, న్యూరాలజిస్టు, ఆంకాలజిస్టు, చివరాఖరకు గైనకాలజిస్టులు కలసి మూడు కుట్లు వేసి మరీ చికిత్స చేసినా పదమూడు రోజుల పాటు ఆయన నుదుటిపై అంతసైజు బ్యాండ్ ఎయిడ్ పట్టీ ఎందుకు ఉంచుకోవాల్సి వచ్చిందో అని జనం ఆందోళన కూడా పడ్డారు. అయితే నెటిజనులు మాత్రం జగన్ స్థాయి వ్యక్తికి గాయం తగిలినప్పుడు ఆ మాత్రం పట్టీ లేకపోతే ఎలా అని సెటైర్లూ వేశారు అది వేరే సంగతి.   గర్భిణులకు సిజేరియన్ చేసి కానుపు చేసిన వైద్యులు కూడా కుట్లను వారంలో తీసేస్తారు.. కానీ జగన్ కు మాత్రం 13 రోజుల పాటు కుట్లు వేసిన గాయానికి పట్టీ వేసి అలాగే ఉంచేశారు. 

సరే 13 రోజుల తరువాత జగన్ నుదుటిపై పట్టీ తీసేశారు. పట్టీ తీసేసిన తరువాత ఆయన ముఖం చూసి జనం ఆశ్చర్యపోయారు.   మెడికల్ హిస్టరీలో ఇంతకు మించి మిరాకిల్ ఎక్కడైనా ఉంటుందా అని సంభ్రమాశ్చర్యాలలో మునిగి తేలారు.  ఎందుకంటే.. 13 రోజులు పట్టీతో ఉన్న జగనన్న నుదుటిపై  గీత కూడా కనిపించకపోవడమే.  మొత్తం మీద జగన్ తన చేష్టలు, చర్యలు, ప్రసంగాలతో భలే కామెడీ పండిస్తున్నారంటూ జనం చర్చించుకుంటున్నారు.